Bay of Bengal: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తరాంధ్రలో నేడు, రేపు భారీ వర్షాలు!
- మరో 24 గంటల్లో బలపడనున్న అల్పపీడనం
- దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
ఉత్తరాంధ్రలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, రాగల 24 గంటల్లో ఇది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, దీనికి అనుబంధంగా అక్కడే ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని వివరించింది. మరోవైపు, రాయలసీమ నుంచి దక్షిణ కోస్తా మీదుగా మధ్య తమిళనాడు వరకు కిలోమీటరున్నర ఎత్తులో ఉత్తర-దక్షిణ ద్రోణి ఏర్పడిందని పేర్కొంది. దీని ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని వివరించింది.