Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ కు సైకలాజికల్ అటాప్సీ... సీబీఐ కీలక నిర్ణయం!
- గతంలో ఇండియాలో రెండు సార్లే సైకలాజికల్ అటాప్సీ
- సునందా పుష్కర్, బురారీ ఆత్మహత్యల్లో ఈ తరహా విధానం
- సుశాంత్ జీవితాన్ని పూర్తిగా శోధించనున్న అధికారులు
ఇటీవల మరణించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడని పోస్టుమార్టం నివేదిక వెల్లడించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ, ఆయన మరణం వెనుక గల కారణాల వెలికితీతకు రంగంలోకి దిగిన సీబీఐ, సైకలాజికల్ అటాప్సీ చేయాలని నిర్ణయించింది. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) ఆధ్వర్యంలో ఈ అటాప్సీ జరుగనుంది.
సైకలాజికల్ అటాప్సీ అంటే, అతని మనసును పోస్టుమార్టం చేయడమే. ఇందులో భాగంగా సుశాంత్ జీవితంలో జరిగిన అన్ని ఘటనలనూ సీబీఐ విశ్లేషించనుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులను విచారించి, ఆయన మానసిక స్థితిని అంచనా వేస్తుంది. ఆయన ఎలా నడచుకునేవారు? ఎలా ఉండేవారు? సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించనుంది. చనిపోవడానికి కొన్ని రోజుల ముందు నుంచి ఆయన మానసిక స్థితి ఎలా ఉందన్న విషయాన్ని పరిశీలించడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీబీఐ అధికారులు చెబుతున్నారు.
ఇక ఇలా సైకలాజికల్ అటాప్సీ చేయడం చాలా క్లిష్టతరమైనది. అన్ని అంశాలనూ చాలా క్షుణ్ణంగా పరిశీలించి, విశ్లేషించాల్సి వుంటుందని, ఇప్పటివరకూ ఇండియాలో రెండు సార్లు మాత్రమే ఈ విధానంలో శూల శోధన జరిగిందని తెలుస్తోంది. శశిథరూర్ భార్య సునందా పుష్కర్ కేసులోనూ, ఢిల్లీలోని బురారీ సామూహిక ఆత్మహత్యల కేసులోనూ సైకలాజికల్ అటాప్సీ జరిగింది. ఆపై ఇప్పుడు సుశాంత్ విషయంలో అధికారులు అదే నిర్ణయం తీసుకోవడం గమనార్హం.