Nakka Anandbabu: జగన్ మాస్క్ పెట్టుకోనప్పుడు.. మాస్క్ లేదని దళిత యువకుడిని కొట్టి చంపడమేంటి?: నక్కా ఆనంద్ బాబు
- ఎన్నో ఆశలతో జగన్ ను దళితులు గెలిపించారు
- వారిపై పేటెంట్ హక్కులన్నీ తమవే అన్నట్టుగా వైసీపీ వ్యవహరిస్తోంది
- అమరావతిని జగన్ చంపేశారు
ఎన్నో ఆశలతో జగన్ ను దళితులు ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు చెప్పారు. అయితే దళితులపై పేటెంట్ హక్కులన్నీ తమవే అన్నట్టుగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని... అందుకే వారిని ఏం చేయడానికైనా వెనుకాడటం లేదని అన్నారు. దళితుడిపై శిరోముండనం ఘటన జరిగి 40 రోజులైతే... జగన్ కు ఆ ఘటన ఇప్పుడు గుర్తుకొచ్చిందని విమర్శించారు. ఈ ఘటన గురించి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియడం వల్లే... జగన్ అభద్రతాభావంతో మాట్లాడారని ఎద్దేవా చేశారు.
బయటకు వెళ్లినప్పుడు జగన్ మాస్కులు ధరించరని... అయితే మాస్క్ లేకుండా బయటకు వెళ్లిన దళిత యువకుడిని కొట్టి చంపారని ఆనంద్ బాబు మండిపడ్డారు. దళిత బాలికపై సామూహిక అత్యాచారం జరిపి, పోలీస్ స్టేషన్ ముందు పడేసి వెళ్లిన వారిపై ఇంతవరకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఏపీ రాజధాని అమరావతి ఆరు ఎస్సీ నియోజకవర్గాల మధ్యలో ఉందని... అలాంటి రాజధానిని జగన్ చంపేశారని మండిపడ్డారు.