Pawan Kalyan: న్యాయంగా రావాల్సిన డబ్బు అడిగితే అరెస్ట్ చేస్తారా?: పవన్ కల్యాణ్
- అమరావతి రైతులకు కౌలు డబ్బులు వెంటనే విడుదల చేయాలి
- గత ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాన్ని ఉల్లంఘించింది
- రైతులతో సీఆర్డీఏ చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించాలి
రాష్ట్ర రాజధాని కోసం భూములను త్యాగం చేసిన అమరావతి రైతులకు తక్షణమే వార్షిక కౌలును చెల్లించాలని ఏపీ ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. కౌలు చెల్లింపులో జాప్యం చేయడం సరికాదని అన్నారు. ఒప్పందం ప్రకారం ప్రతి ఏప్రిల్ నెలలో రైతులకు వార్షిక కౌలును చెల్లించాలని... గత ఏడాది కూడా ప్రభుత్వం ఒప్పందాన్ని ఉల్లంఘించి కౌలును ఆలస్యంగా చెల్లించిందని విమర్శించారు. కౌలు చెల్లింపులో వరుసగా రెండో ఏడాది కూడా ప్రభుత్వం జాప్యం చేస్తోందని... తద్వారా డబ్బులు వస్తాయో? రావో? అనే ఆందోళనలోకి రైతాంగాన్ని నెట్టేసిందని అన్నారు.
భూములు ఇచ్చిన రైతులకు ఈ ఏడాది రూ. 189.7 కోట్ల రూపాయలను కౌలుగా చెల్లించాల్సి ఉందని పవన్ చెప్పారు. రైతులతో సీఆర్డీఏ చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించాలని అన్నారు. కరోనా సమయంలో కౌలును సరైన సమయంలో చెల్లించాలని అధికారులను రైతులు కోరారని... జనసేన కూడా ఇదే విన్నపాన్ని చేసిందని చెప్పారు. కౌలు డబ్బులను విడుదల చేస్తున్నట్టు జూన్ 21వ తేదీన రెండు జీవోలను ప్రభుత్వం విడుదల చేసిందని... అయినా ఇంతవరకు ఏ రైతు ఖాతాలోకి డబ్బు పడలేదని దుయ్యబట్టారు. సాంకేతిక కారణాలను చూపుతూ కౌలు డబ్బును విడుదల చేయకపోవడం రైతులను క్షోభ పెట్టడమే అవుతుందని అన్నారు.
రాజధానిని నిలుపుకోవడం కోసం అమరావతి రైతులు 250 రోజులకు పైగా పోరాటం చేస్తున్నారని... అలాంటి వారికి కౌలు చెల్లించకపోవడం ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందని చెప్పారు. కౌలు డబ్బులు అడిగేందుకు సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లిన రైతులను అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. న్యాయంగా రావాల్సిన డబ్బు అడిగితే అరెస్ట్ చేస్తారా? అని మండిపడ్డారు. తక్షణమే రైతులకు కౌలు చెల్లించాలని డిమాండ్ చేశారు.