Ambati Rambabu: అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ చేస్తున్నారు: హైకోర్టులో పిల్ వేసిన వైసీపీ కార్యకర్తలు
- అంబటి రాంబాబుపై పిల్ వేసిన రాజుపాలెం వైసీపీ కార్యకర్తలు
- నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించిన హైకోర్టు
- తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా
వైసీపీ కీలక నేత అంబటి రాంబాబుకు సొంత పార్టీ కార్యకర్తలే భారీ షాకిచ్చారు. ఆయన అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారంటూ రాజుపాలెం వైసీపీ కార్యకర్తలు ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం కోట నెమిలిపురి, కొండమోడులో అక్రమ మైనింగ్ జరిగిందని పిల్ లో ఆరోపించారు. ఈ విషయంపై సీఎం జగన్, జిల్లా కలెక్టర్, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పిటిషన్లు పంపినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే స్ధానిక మైనింగ్ అధికారులు విచారణ జరిపారని కూడా పిటిషన్‌లో వీరు పేర్కొన్నారు.
వైసీపీ కార్యకర్తల తరపున హైకోర్టు న్యాయవాది నాగరఘు ఈ పిల్ ను దాఖలు చేశారు. వాదనలు విన్న హైకోర్టు... అధికారిక పార్టీకి చెందిన వారే పిటిషన్ వేస్తే... అది ప్రజాప్రయోజన వ్యాజ్యం ఎలా అవుతుందని ప్రశ్నించింది. అక్రమ మైనింగ్ పై వెంటనే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.