Youth: పార్లమెంట్ భవనం ముందు అనుమానాస్పద రీతిలో కనపడిన యువకుడి అరెస్ట్!

CRPF Arrest One Suspecious Youth near Parliament

  • అదుపులోకి తీసుకున్న సీఆర్పీఎఫ్
  •  డ్రైవింగ్ లైసెన్స్ లో ఓ పేరు, ఆధార్ కార్డులో మరో పేరు
  • లాక్ డౌన్ సమయంలో ఢిల్లీకి వచ్చానంటున్న యువకుడు

పార్లమెంట్ ఎదుట అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, అతని వివరాలను రాబట్టడంలో తలమునకలై ఉన్నారు. అతని వద్ద ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ లో ఓ పేరు, ఆధార్ కార్డులో మరో పేరు ఉండటంతో పాటు, అతని వద్ద లభించిన ఓ లెటర్ లో అర్థంకాని కోడ్ భాషలో కొన్ని వాక్యాలు ఉండటమే ఇందుకు కారణం.

అతను పార్లమెంట్ ఎదుట ఉన్న పచ్చిక బయళ్లలో కూర్చుని, అనుమానాస్పదంగా కనిపించడంతో భద్రతా దళాలు అదుపులోకి తీసుకుని ప్రశ్నించాయి. అతని భుజాలకు వేలాడుతూ ఓ బ్యాక్ ప్యాక్ కూడా కనిపించడంతో సీఆర్పీఎఫ్ (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) దళాలు అనుమానించి, అతని వివరాలు అడిగారు. ఆపై హై సెక్యూరిటీ జోన్ లో ఎందుకు కూర్చున్నావంటూ అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

తాను జమ్మూ కశ్మీర్ లోని బుద్గాం జిల్లా నుంచి వచ్చానని మాత్రమే అతను చెప్పగా, తీసుకెళ్లి సెంట్రల్ ఢిల్లీ పోలీసులకు అప్పగించారు.ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చిన టీమ్ ఇప్పుడు అతన్ని ప్రశ్నిస్తోంది. తమ ప్రశ్నలకు అతను పొంతన లేకుండా సమాధానాలు ఇస్తున్నాడని, 2016లో ఢిల్లీకి తొలిసారి వచ్చానని, తాజాగా లాక్ డౌన్ సమయంలో బలవంతంగా రావాల్సి వచ్చిందని అంటున్నట్టు తెలుస్తోంది. పాత ఢిల్లీ ఏరియాలోని నిజాముద్దీన్ ప్రాంతంలో అతను ఉంటున్నాడని తెలుసుకున్న పోలీసులు, విచారణ కొనసాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News