West Godavari District: తనువు చాలిద్దామని గోదావరిలోకి దూకి.. ప్రాణంపై ఆశతో 15 గంటలపాటు చెట్టును పట్టుకుని వేలాడిన వ్యక్తి!
- పశ్చిమ గోదావరి జిల్లాలో ఘటన
- జీవితంపై విరక్తితో గోదావరిలోకి దూకిన అత్తిలి వాసి
- బోటు సాయంతో రక్షించిన పోలీసులు
జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకునేందుకు గోదావరిలో దూకిన వ్యక్తికి అంతలోనే ప్రాణంపై ఆశ కలిగింది. కొట్టుకుపోతున్న ఆయనకు ఓ చెట్టు కనిపించడంతో దానిని పట్టుకుని సాయం కోసం ఏకంగా 15 గంటలపాటు ఎదురుచూసి మొత్తానికి గట్టెక్కాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిందీ ఘటన.
అత్తిలికి చెందిన కీలపర్తి శ్రీనివాసరావు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకునేందుకు మంగళవారం సాయంత్రం జొన్నాడ వంతెన వద్దకు చేరుకుని బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకాడు. నదిలో కొట్టుకుపోతున్న ఆయనకు మార్గమధ్యంలో ప్రాణాలపై తీపి కలిగింది. దీంతో ప్రాణాలతో బయటపడాలని భావించాడు. ఈ క్రమంలో ఇసుక మేటల్లో చెట్టు కనిపించడంతో దానిని పట్టుకుని ఉండిపోయాడు. అలా దాదాపు 15 గంటలపాటు చెట్టును పట్టుకునే ఉన్నాడు. బుధవారం మధ్యాహ్నం అతడిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బోటు సాయంతో అతడిని ఒడ్డుకు చేర్చారు. అనంతరం అతడి బంధువులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు.