Donald Trump: ట్రంపా? బైడెనా?..: జోరుగా సాగుతున్న బెట్టింగ్!

Heavy Bidding on Next Potus

  • తదుపరి యూఎస్ అధ్యక్షుడు ఎవరు?
  • ట్రంప్ రెండో పర్యాయం ఎన్నికయ్యేనా?
  • 2016లో విఫలమైన ఒపీనియన్ పోల్స్
  • ఇటీవలి కాలంలో పడిపోయిన ట్రంప్ గ్రాఫ్
  • ప్రజలు ఆయనకు దూరం అవుతున్నారంటున్న పోల్స్

నవంబర్ లో జరిగే అమెరికా ఎన్నికల్లో గెలిచి, తదుపరి అధ్యక్షుడిగా ఎవరుంటారు? ఇప్పుడున్న డొనాల్డ్ ట్రంపే కొనసాగుతారా? లేక డెమోక్రాట్ల తరఫున బరిలో ఉన్న జో బైడెన్ గెలుస్తారా? ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ చర్చ కొనసాగుతోంది. వాస్తవానికి కొన్ని పరిస్థితులలో తప్ప, అమెరికన్లు ప్రతి అధ్యక్షుడికీ రెండు పర్యాయాలు అవకాశం ఇస్తుంటారు (అమెరికా రాజ్యాంగం ప్రకారం ఎవరైనా సరే రెండుసార్లకు మించి అధ్యక్షుడు కాలేరు). బిల్ క్లింటన్, జార్జ్ బుష్, బరాక్ ఒబామాలు రెండేసి పర్యాయాలు అధ్యక్షులుగా పనిచేసిన వారే. కానీ, ఇప్పుడు మాత్రం పరిస్థితి ట్రంప్ రెండోసారి ఎన్నికయ్యేందుకు అనుకూలంగా కనిపించడం లేదు.

ట్రంప్, బైడెన్ ల మధ్య సాగుతున్న పోరుపై అమెరికా మీడియాలో నిత్యమూ వార్తలు వస్తూనే ఉన్నాయి. తదుపరి 'పోటస్' (ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్) ఎవరు అవుతారన్న బెట్టింగ్ కూడా జోరుగానే సాగుతోంది. నాలుగేళ్ల క్రితం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న విషయంలో స్పష్టంగా చెప్పడంలో దాదాపు ప్రతి ఒపీనియన్ పోల్ సంస్థ విఫలమైంది. 2016లో ఒపీనియన్ పోల్స్ విడిపోయాయి. చాలా వరకూ సంస్థలు హిల్లరీ క్లింటన్ గెలుస్తారని చెప్పగా, కొన్ని సంస్థలే ట్రంప్ విజయం సాధిస్తారని అన్నాయి.

అయితే, హిల్లరీకి ఓట్లు అధికంగా రాగా, ట్రంప్ సీట్లను అధికంగా గెలుచుకుని పగ్గాలను చేపట్టారు. అయితే, ఆపై ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు, దేశంలో నల్లజాతి ప్రజలపై పెరిగిన దాడులు, ఇటీవలి కరోనా సంక్షోభం ట్రంప్ కు కష్టాలు తెచ్చిపెట్టాయి. ప్రజలు ఆయన్నుంచి దూరం అవుతున్నారని ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది.

ఈ సంవత్సరం మార్చి నుంచి జరుగుతున్న ఒపీనియన్ పోల్స్ లో జో బైడెన్ క్రమంగా తన ఆధిక్యతను పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఆయనకు 51.4 శాతం మంది అమెరికన్ల మద్దతు లభిస్తుండగా, ట్రంప్ కు 42.1 శాతం మంది ప్రజలు మాత్రమే అండగా ఉన్నారని తెలుస్తోంది. ఇక వీరిద్దరిలో ఎవరు గెలుస్తారన్న విషయంలో మిలియన్ల డాలర్ల కొద్దీ పందాలు జోరుగా సాగుతున్నాయి. ఒక్క అమెరికాలో మాత్రమే కాదు, పలు విదేశాల్లోనూ పందాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి.

కాగా, ఫిబ్రవరి నుంచి మే మధ్య బైడెన్ పై స్పష్టమైన ఆధిక్యంతో కనిపించిన ట్రంప్, ఆపై క్రమంగా బలహీనపడిపోయారు. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో నిర్వహించిన ఒపీనియన్ పోల్ లో ట్రంప్ కు అందనంత ఎత్తుకు బైడెన్ ఎదిగిపోయారు. అయితే, ఇంకా ఎన్నికలకు రెండు నెలలకు పైగానే సమయం ఉండటం, అది చాలా ఎక్కువ సమయమేనని భావిస్తున్న వారు ట్రంప్ పుంజుకోవచ్చని కూడా అంచనా వేస్తున్నారు.

ఇక ఎవరు విజయం సాధిస్తారన్నది స్టాక్ మార్కెట్ కు మాత్రమే స్పష్టంగా తెలుస్తుందని నమ్మేవారూ చాలా మందే ఉన్నారు. ఎన్నికలకు మూడు నెలల ముందు మార్కెట్ లాభపడితే, కచ్చితంగా ట్రంప్ గెలుస్తారని, మార్కెట్ పడిపోతే మాత్రం విజయం బైడెన్ దే అవుతుందని చాలా మంది విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం మార్కెట్ పెరుగుతూ ఉంది. మరి రానున్న రెండు నెలల్లో మొగ్గు ఎటువైపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.

  • Loading...

More Telugu News