Raghurama Krishnaraju: ఇది అమరావతి రైతులకు పాక్షిక విజయం: రఘురామకృష్ణరాజు
- వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు చట్టం అమలుపై స్టేటస్ కో
- రైతులు మరింత ఆశాభావంతో ఉండాలన్న రఘురామ
- గాంధేయ మార్గంలో ముందుకెళ్లాలని సూచన
ఏపీలో పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు చట్టంపై స్టేటస్ కోను హైకోర్టు సెప్టెంబరు 21 వరకు పొడిగించడం పట్ల నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హర్షం వ్యక్తం చేశారు. న్యాయం కోసం పోరాడుతున్న అమరావతి రైతులకు దక్కిన పాక్షిక విజయం అని అభివర్ణించారు. రైతులు మరింత ఆశాభావంతో ఉండాలని, కళ్లు లేకపోయినా మనసున్న న్యాయస్థానాల ద్వారా తప్పకుండా న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని పునరుద్ఘాటించారు.
ఫలితం కాస్త ఆలస్యమైనప్పటికీ గాంధేయ మార్గంలో ముందుకెళ్లాలని అమరావతి రైతులకు ఉద్బోధించారు. దేవుడు తమవైపు ఉన్నాడని, న్యాయం తమవైపు ఉందని అన్నారు. స్టేటస్ కో అయినా, స్టే అయినా పెద్దగా తేడా ఏమీ లేదని, న్యాయమూర్తులే దేవుళ్లని పేర్కొన్నారు. కౌలు అడిగిన రైతులను అరెస్ట్ చేసి నిన్న సాయంత్రం 4 గంటలకు వదిలినట్టు తనకు తెలిసిందని, రైతులను అరెస్ట్ చేయడం బాధాకరమని రఘురామ వ్యాఖ్యానించారు.