Telangana: రైతు బంధు పథకాన్ని, రైతు సమన్వయ సమితిల ఏర్పాటును కేంద్రం అభినందించింది: తెలంగాణ సీఎంఓ
- కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి ఆధ్వర్యంలో సమావేశం
- సీఎం కేసీఆర్ తరఫున రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి హాజరు
- కేంద్రానికి పలు సూచనలు చేసిన నిరంజన్ రెడ్డి
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వివిధ రాష్ట్రాల సీఎంలు, వ్యవసాయ శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ తరఫున వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. దీనిపై తెలంగాణ సీఎంఓ ఓ ప్రకటన వెలువరించింది. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని, రైతు సమన్వయ సమితిల ఏర్పాటును కేంద్రం అభినందించిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
తమ కార్యక్రమాలను కేంద్రమంత్రి సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారని, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో తెలంగాణలో విజయవంతంగా అమలు చేస్తున్నారంటూ తమను ప్రశంసించారని వివరించారు. కాగా, ఈ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి రాష్ట్రం తరఫున కేంద్రానికి పలు సూచనలు చేశారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఇచ్చే రుణాలపై వడ్డీభారం లేకుండా చేయాలని, తద్వారా అధిక ప్రయోజనం లభిస్తుందని తెలిపారు. వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరించాలని, వడ్డీలేని రుణాలు మరింతమంది పెట్టుబడిదారులను ఆకర్షించగలుగుతాయని వివరించారు.