Pradeep: తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన యాంకర్ ప్రదీప్

Anchor Pradeep condemns rumors on him circulated in media and social media
  • తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ ఓ యువతి ఫిర్యాదు
  • ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు
  • యాంకర్ ప్రదీప్ పైనా ఆరోపణలు అంటూ ప్రచారం
  • వ్యూస్ కోసం ఇలా చేస్తారా? అంటూ ప్రదీప్ ఆక్రోశం
  • తన కుటుంబానికి ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత అంటూ వ్యాఖ్యలు 
మిర్యాలగూడకు చెందిన ఓ అమ్మాయి హైదరాబాదులో తనపై 139 మంది అత్యాచారం చేశారని, వారిలో సినీ ప్రముఖులు కూడా ఉన్నారంటూ ఆరోపించడం తెలిసిందే. ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. కాగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు కూడా ఉన్నాడంటూ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రదీప్ స్వయంగా వివరణ ఇచ్చారు. కొన్ని యూట్యూబ్ చానళ్లలో తనపై వస్తున్న కథనాలు చాలా బాధాకరమని పేర్కొన్నారు. నిజానిజాలు నిర్ధారణ చేసుకోకుండా ఎలా రాస్తారని ప్రశ్నించారు.

"వాళ్లు అనుకున్నదే నిజమని రాస్తూ, నా ఫొటోలు వాడుతూ, నా పేరు మీద హెడ్డింగులు పెడుతూ వికృత కథనాలు వెలువరిస్తున్నారు. ఎంతో సున్నితమైన అంశంలో నా పేరు ఎందుకు ఉందో అని కూడా ఆలోచించకుండా దారుణమైన రీతిలో రాసేస్తున్నారు. ఒక వ్యక్తికి న్యాయం జరగడం కోసం ఇంకో వ్యక్తి జీవితాన్ని నాశనం చేసేస్తారా? వ్యూస్ కోసం ఇష్టంవచ్చినట్టు రాసేస్తారా? ఇలాంటి వ్యూస్ దేనికి పనికొస్తాయి? నిజం ఎప్పటికైనా బయటికి వస్తుంది కదా... అప్పటివరకు ఆగలేరా?

కొన్ని చానళ్లు, కొన్ని యూట్యూబ్ చానళ్లు చేస్తున్నదానికి నాకు, నా కుటుంబానికి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు? నాకు వినోదం అందించడం తప్ప మరేమీ తెలియదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎవరి అండ లేకుండా ఈస్థాయికి వచ్చాను. నాకు తెలిసింది ఒకరికి సహాయం చెయ్యడమే తప్ప, ఎవరికీ అన్యాయం చేయలేదు. నేనేం తప్పు చేశానని నాపై ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు?" అంటూ ప్రదీప్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రదీప్ ఓ వీడియో రిలీజ్ చేశారు.
Pradeep
Anchor
Rumors
Media
Social Media
Tollywood

More Telugu News