S Suresh Babu: అంతమందిని కాపాడతానన్న నమ్మకం నాకు లేదు.. అది ఉన్నవారు షూటింగ్స్ చేసుకోవచ్చు: నిర్మాత డి.సురేశ్ బాబు

Tollywood Producer Suresh Babu Comments on Movie Shootings
  • ఉపాధి కోసం షూటింగ్స్ చేయాలా?
  • ఎస్పీ బాలు పరిస్థితేంటి?
  • మా యూనిట్ లో 150 మంది ఉంటారు
  • భౌతికదూరం, మాస్క్ లు షూటింగ్ లో సాధ్యం కాదు
  • ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్లే పరిస్థితి కూడా లేదు
షూటింగ్స్ చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టంగా చెప్పినా, తన సినిమాలు మాత్రం ఇంకో రెండు, మూడు నెలల పాటు ప్రారంభం కాబోవని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి తనకు నటీనటులు, సాంకేతిక నిపుణుల ఆరోగ్యమే ముఖ్యమని, దానికి తాను గ్యారెంటీ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నానని ఆయన అన్నారు. తాజాగా, ఓ పత్రికకు షూటింగ్స్ ప్రారంభంపై అభిప్రాయాలను వెల్లడించిన ఆయన, సెట్ లో ఉన్న వారందరినీ కాపాడగలనన్న నమ్మకం తనకు లేదని చెప్పారు.

తన బ్యానర్ లో తీస్తున్న చిత్రానికి సంబంధించి 27 రోజుల షూటింగ్ ఉందని, అన్నీ యాక్షన్ సీన్లేనని, దాదాపు 100 మంది జూనియర్ ఆర్టిస్టులతో పాటు షూటింగ్ స్పాట్ లో 150 మంది వరకూ ఉండాల్సి వుంటుందని వెల్లడించిన ఆయన, అంతమంది ఒకే చోట భౌతికదూరం లేకుండా, మాస్క్ లు లేకుండా షూటింగ్ లో పాల్గొనడం ప్రస్తుతం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. రహదారులపై కూడా 30 శాతం మంది మాస్క్ లను ధరించడం లేదని ఆయన అన్నారు.

ఒకవేళ సినిమా పూర్తయినా, తన ఫ్యామిలీ, స్నేహితులతో కలిసి తానే థియేటర్ కు వెళ్లబోనని, అటువంటిది ఇప్పుడు షూటింగ్స్ ఎందుకని ప్రశ్నించారు. ఇప్పట్లో తాను థియేటర్ లో సినిమాను చూడబోనని, ఏసీతో పూర్తి మూసివుంచబడే హాల్ లో ముక్కుకు, మూతికి మాస్క్ కట్టుకుని, నవ్వొస్తే నవ్వకుండా ఎలా ఉండగలమని, అటువంటప్పుడు సినిమాను ఆస్వాదించలేమని ఆయన అన్నారు. సినీ కార్మికుల ఉపాధి కోసం షూటింగ్స్ చేయడం మంచిదేనని, ఇదే సమయంలో దాన్ని హ్యాండిల్ ఎవరు చేయాలి? ఎలా చేయాలన్నదే సమాధానం లేని ప్రశ్నలని సురేశ్ బాబు వ్యాఖ్యానించారు.

టీవీ షూటింగ్స్ జరుగుతున్నాయన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, వాళ్లు ఓ రోజు షూట్ చేసి అమ్మితే, ఓ 50 వేల రూపాయల లాభం వస్తుందన్న గ్యారంటీ ఉంటుందని, కానీ సినిమా వాళ్లకు ఆ గ్యారంటీ లేదని అన్నారు. ఉపాధి కోసమే ఎస్పీ బాలసుబ్రహ్మణం టీవీ షోలు చేస్తున్నారని, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కరోనా సోకి ఆయన ప్రాణాపాయ స్థితి వరకూ వెళ్లి, అదృష్టవశాత్తూ బయట పడ్డారని, లేకుంటే పరిశ్రమకు ఎంతో నష్టం వాటిల్లేదని సురేశ్ బాబు వ్యాఖ్యానించారు. ధైర్యం ఉన్నవారు షూటింగ్స్ చేసుకోవచ్చని, తనకు మాత్రం ఆ ధైర్యం లేదని చెప్పారు.
S Suresh Babu
Shootings
Restart
Corona Virus

More Telugu News