India: ఇచ్చిన సాక్ష్యాలు సరిపోలేదా? ఇకనైనా కదలండి: ఉగ్రమూకలపై చర్యలకు పాక్ ను డిమాండ్ చేసిన భారత్
- పుల్వామా ఉగ్రదాడిపై పాక్ కు సాక్ష్యాలు
- నిందితుల్లో చాలా మంది ఇస్లామాబాద్ లోనే
- వెంటనే చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్
గత సంవత్సరం పుల్వామాపై జరిగిన ఉగ్రదాడిలో ప్రమేయమున్న ఉగ్రవాదులందరినీ ప్రాసిక్యూట్ చేయాలని పాకిస్థాన్ ను ఇండియా డిమాండ్ చేసింది. ఈ సూసైడ్ బాంబింగ్ దాడికి జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్, ఇతర ఉగ్రవాదులు కారణమని చెబుతూ, దాడికి ప్లాన్ చేసిన వారిలో చాలా మంది ఇంకా ఇస్లామాబాద్ లోనే ఆశ్రయం పొందుతున్నారని స్పష్టం చేసింది. వీరి విషయంలో పాక్ తక్షణమే స్పందించాలని, ఎన్ఐఏ తయారు చేసిన చార్జ్ షీట్ లో అందరి పేర్లనూ, వారి వివరాలను, దాడిలో ప్రమేయానికి సంపాదించిన సాక్ష్యాలనూ పొందుపరిచామని వెల్లడించింది.
అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడితో దావూద్ ఇబ్రహీంను ఉగ్రవాదిగా గుర్తిస్తున్నట్టు పాక్ వెల్లడించడాన్ని ప్రస్తావించిన అధికారులు, కేవలం వారి పేర్లను బహిర్గతం చేసుకున్నంత మాత్రాన, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పాక్ చర్యలు తీసుకుంటుందని భావించలేమని, పాక్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, తన భూ భాగంలో ఉగ్రవాదులందరినీ పాక్ ఏరివేయాలని కోరింది.
కాగా, పుల్వామా దాడిపై భారత్ సమర్పించిన సాక్ష్యాలను పాక్ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ఇదంతా భారత్ చేస్తున్న కుట్రని, తమ దేశంపై అభాండాలు వేయడం వారికి ఆది నుంచి అలవాటేనని విమర్శలు గుప్పించింది. అయితే, తాము చాలినన్ని సాక్ష్యాలను అందించామని, ఇకనైనా తాము పేర్కొన్న ఉగ్రవాదులను కఠినంగా శిక్షించేందుకు చర్యలను ప్రారంభించాలని భారత్ డిమాండ్ చేసింది. ఎన్ఐఏ చార్జ్ షీట్ లో మసూద్ అజర్ తో పాటు అతని ఇద్దరు సోదరులు అబ్దుల్ రవూఫ్ అస్గర్ అల్వీ, అమర్ అల్వీ, అతని మేనల్లుడు మహమ్మద్ ఉమర్ ఫరూక్, మరో 15 మంది పేర్లను పేర్కొన్న సంగతి తెలిసిందే.