Supreme Court: డిగ్రీ, పీజీ ఫైనలియర్ పరీక్షలు జరిపితీరాల్సిందే!: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- పరీక్షలను రద్దు చేయొద్దు
- చివరి ఏడాది పరీక్షలు నిర్వహించవలసిన అవసరం ఉంది
- రాష్ట్ర ప్రభుత్వాలు వాయిదా వేయవచ్చు
- పరీక్షలు రాయకుండా మాత్రం ఎవరినీ పాస్ చేయద్దు
దేశ వ్యాప్తంగా డిగ్రీ, పీజీ ఫైనలియర్, సెమిస్టర్ పరీక్షలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు తిరస్కరించింది. చివరి ఏడాది పరీక్షలు నిర్వహించవలసిన అవసరం ఉందని తెలిపింది. అయితే, కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా నిర్ణయం తీసుకుని వాటిని వాయిదా వేయవచ్చని పేర్కొంది. పరీక్షలు రాయకుండా మాత్రం ఎవరినీ పాస్ చేయవద్దని సూచించింది. పరీక్షల నిర్వహణపై ఇప్పటికే యూజీసీ గైడ్‌లైన్స్‌ని ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.
ఇప్పటికే విద్యార్థులు ఐదు సెమిస్టర్లు పూర్తి చేశారని, వాటి ఆధారంగా తుది పరీక్షల ఫలితాలు ప్రకటించాలని కోరిన పిటిషన్ల వాదనలతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. పరీక్షలు నిర్వహించకుండా పై తరగతులకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రమోట్ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
అయితే, రాష్ట్ర ప్రభుత్వాలు యూజీసీతో సంప్రదింపులు జరిపి పరీక్షల నిర్వహణ తేదీలను ఖరారు చేయవచ్చని పేర్కొంది. యూజీసీ ప్రకటించిన సెప్టెంబరు 30 గడువును మాత్రం రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించవలసిన అవసరం లేదని తెలిపింది. పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని యూజీసీ జారీ చేసిన మార్గదర్శకాలు మాత్రం సరైనవేనని తెలిపింది.