Nara Lokesh: నిషా దందాని బయటపెట్టినందుకే దళిత యువకుడు ఓం ప్రతాప్ ను దారుణంగా చంపేశారు: నారా లోకేశ్
- జగన్ రూ.25 వేల కోట్ల దోపిడీకి తెరలేపారన్న లోకేశ్
- ఓం ప్రతాప్ హత్య వెనుక మంత్రి, ఎంపీ ఉన్నారంటూ ఆరోపణలు
- హత్యపై న్యాయవిచారణ జరగాలంటూ డిమాండ్
వైఎస్ జగన్ మద్యపాన నిషేధం పేరుతో రూ.25 వేల కోట్ల దోపిడీకి తెరలేపారని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. నిషేధం పేరుతో జరుగుతున్న నిషా దందాని బట్టబయలు చేసినందుకు దళిత యువకుడు ఓం ప్రతాప్ ని దారుణంగా హత్య చేశారని లోకేశ్ ఆరోపించారు. ఈ హత్య వెనుక స్వయంగా జిల్లా మంత్రి, ఎంపీ ఉన్నారని తెలిపారు. వాస్తవాలు బయటికి తెలియనివ్వకుండా, కనీసం కేసు కూడా నమోదు చేయకుండా నిజాన్ని పూడ్చేశారని వెల్లడించారు. విషయం బయటికి రావడంతో ఇప్పుడు కేసు, పోస్టుమార్టం అంటున్నారని విమర్శించారు.
"అది హత్య కాకపోతే సర్కారుకు భయమెందుకు? టీడీపీ నేతలను ఆ గ్రామానికి వెళ్లనివ్వకుండా ఎందుకు గృహనిర్బంధంలో ఉంచుతున్నారు? పోస్టుమార్టం జరుగుతున్నప్పుడు ఎంపీ పక్క ఊరిలో ఎందుకు ఉన్నట్టు? దళిత యువకుడ్ని అంతం చేసి ఆధారాలు లేకుండా చేస్తారా?" అంటూ లోకేశ్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఓం ప్రతాప్ హత్యపై న్యాయవిచారణ జరగాలని, ప్రభుత్వంపై గళమెత్తిన ప్రతాప్ ని కడతేర్చిన వారికి కఠినశిక్ష పడాలని వ్యాఖ్యానించారు. దళితులు రాష్ట్రంలో స్వేచ్ఛగా జీవించే వాతావరణం కల్పించాలని తన ట్వీట్ లో పేర్కొన్నారు.