Somireddy Chandra Mohan Reddy: రిజర్వేషన్ వర్గీకరణపై సుప్రీంకోర్టు నిర్ణయం శుభపరిణామం: సోమిరెడ్డి

 Somireddy welcomed apex court opinions on classification

  • ఎస్సీ, ఎస్టీల వర్గీకరణపై రాష్ట్రాలకు హక్కుందున్న సుప్రీం
  • సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించిన సోమిరెడ్డి
  • వర్గీకరణ సమంజసం అంటూ వ్యాఖ్యలు

ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాల జాబితాల్లో ఎన్నో అసమానతలు ఉన్నాయని, రిజర్వేషన్ ఫలాలు కిందిస్థాయి వరకు చేరడంలేదని, విభిన్న వర్గాల వారిని పరిశీలించి, వారి జీవనాన్ని అంచనా వేసి, వారికి తగిన విధంగా రిజర్వేషన్లు కల్పించి పైకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న హక్కును కాదనలేం అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన అభిప్రాయాలను టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వాగతించారు. రిజర్వేషన్ వర్గీకరణ అంశంలో ఇది కీలక పరిణామం అని, సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయం శుభపరిణామం అని పేర్కొన్నారు.

రిజర్వేషన్లను సమూలంగా సమీక్షించడం ద్వారా అట్టడుగు వర్గాల వారికి, ఇంతకాలం రిజర్వేషన్లకు నోచుకోని వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ధర్మాసనం క్రీమీ లేయర్ ను కూడా ప్రస్తావించిందని, ప్రస్తుతం ఇది సమాజానికి ఎంతో అవసరమైన అంశం అని పేర్కొన్నారు. ఒకే కుటుంబంలో మూడు తరాలుగా రిజర్వేషన్లను అనుభవిస్తున్న వారిని చూస్తున్నామని, అదే సమయంలో మూడు తరాలుగా ఎలాంటి రిజర్వేషన్ ఫలాలు అనుభవించకుండా అణగారిన వర్గాలుగా మిగిలిన వారిని కూడా చూస్తున్నామని వెల్లడించారు.

ఈ అసమానతలను తొలగించేందుకు క్రీమీ లేయర్ విధానాన్ని కూడా సమీక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని సోమిరెడ్డి స్పష్టం చేశారు. అంతేకాకుండా, దేశంలో వర్గీకరణకు మొదటిసారిగా ప్రతిపాదన చేసింది అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వమేనని, రిజర్వేషన్ ఫలాలు అట్టడుగు వర్గాల వారికి అందడంలేదని నాడు ఎస్సీ వర్గీకరణపై విధానపరమైన నిర్ణయంతో అసెంబ్లీలో తీర్మానం చేసినట్టు వెల్లడించారు. అది ఎంత సమంజసమైందో తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన సందేశం వెల్లడిస్తోందని, అప్పట్లో పార్లమెంటులో చట్టం చేయాలనే నిబంధనతో అసెంబ్లీలో చేసిన తీర్మానం అమలు కాలేదని, వర్గీకరణ హక్కు రాష్ట్రాలకే ఉందని ఇప్పుడు కోర్టు చెబుతోందని సోమిరెడ్డి వివరించారు.

  • Loading...

More Telugu News