Mahesh Bhagawat: లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత దొంగతనాలు పెరిగాయి: మహేశ్ భగవత్
- లాక్ డౌన్ సమయంలో దొంగతనాలు తగ్గిపోయాయి
- ఇటీవల జరిగిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశాం
- వీరిలో ఒక నిందితుడు హత్య కేసులో కూడా ఉన్నాడు
లాక్ డౌన్ సమయంలో పూర్తిగా తగ్గిపోయిన దొంగతనాలు... నిబంధనలను సడలించిన తర్వాత మళ్లీ పెరిగాయని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన చోరీ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశామని చెప్పారు.
మధ్యప్రదేశ్ కు చెందిన రితురాజ్ సింగ్ అనే వ్యక్తి ఈ కేసులో ప్రధాన నిందితుడని తెలిపారు. 2016లో మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ హత్య కేసులో కూడా ఇతను నిందితుడిగా ఉన్నాడని చెప్పారు. ఆ కేసులో జైలు నుంచి బెయిలుపై విడుదలైన తర్వాత హైదరాబాదుకు వచ్చి, ప్రసాద్ సేన్ అనే వ్యక్తితో కలిసి దొంగతనాలు చేస్తున్నాడని తెలిపారు.
దొంగతనానికి ముందు వీరు రెక్కీ నిర్వహిస్తారని... శివారు ప్రాంతాల్లోనే ఎక్కువ చోరీలకు పాల్పడ్డారని భగవత్ చెప్పారు. వీరి నుంచి 26 తులాల బంగారం, రెండున్నర కేజీల వెండి, రూ. 1.80 లక్షల నగదుతో పాటు రెండు ద్విచక్ర వాహనాలు, ఒక లాప్ టాప్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బైక్ చోరీల కేసులో గతంలో రితురాజ్ అరెస్ట్ అయినట్టు చెప్పారు.