Shweta Singh Kirti: నువ్వు చాలానే చేశావు.... రియా చక్రవర్తిపై సుశాంత్ సోదరి ఆగ్రహం!

Sushant Singh Rajput sister Shweta Singh Kirti fires in Rhea Chakraborty
  • సుశాంత్ మరణంపై ఆరని జ్వాలలు
  • రియా వర్సెస్ సుశాంత్ ఫ్యామిలీ మెంబర్స్
  • సుశాంత్ ను కుటుంబ సభ్యులు పట్టించుకోలేదన్న రియా
  • రాక్ సాలిడ్ గా అతడి వెంట నిలిచామన్న సోదరి
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత రాజుకున్న పరిణామాలు తీవ్రరూపు దాల్చాయి. నటి రియా చక్రవర్తికి సుశాంత్ కుటుంబ సభ్యులకు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సుశాంత్ డిప్రెషన్ తో బాధపడుతున్నప్పుడు కుటుంబ సభ్యులు అతడ్ని పట్టించుకోలేదని రియా ఆరోపించింది. దీనిపై సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి మండిపడ్డారు.

"మేం సుశాంత్ ను ప్రేమించలేదని రియా అంటోంది. ప్రేమ లేకపోతే అతడి కోసం జనవరిలో అన్నీ వదిలిపెట్టుకుని అమెరికా నుంచి చండీగఢ్ ఎందుకు వస్తాను? నా వ్యాపారాలను నిలిపివేసి, నా పిల్లలను అక్కడే వదిలేసి నా సోదరుడ్ని కలిసేందుకు వచ్చాను. కానీ నా దురదృష్టం కొద్దీ సుశాంత్ నేను వచ్చేసరికి చండీగఢ్ నుంచి వెళ్లిపోయాడు. అందుకు కారణం రియానే. అదే పనిగా కాల్స్ చేసి అతడ్ని ముంబయి పిలిపించుకుంది. రెండు, మూడ్రోజుల వ్యవధిలో 25 సార్లు కాల్ చేసింది.

అతడ్ని అంత అర్జెంటుగా వెనక్కి రప్పించాల్సిన అవసరం ఏమొచ్చింది? అంతకుముందు సుశాంత్ రాణి అక్కకు ఓ ఎమర్జెన్సీ కాల్ చేశాడు. అతడ్ని డ్రగ్స్ మత్తులో ముంచి నిర్బంధించారని తెలిసింది. ఆ తర్వాత సుశాంత్ చండీగఢ్ రాగా, రియా అతడ్ని అక్కడ నిలవనీయలేదు. కానీ రియా ఆరోపిస్తున్నట్టు మా కుటుంబం సుశాంత్ వెంట లేదు అనేది పచ్చి అబద్ధం. మేం సుశాంత్ వెంట రాక్ సాలిడ్ గా నిలిచాం.

మేలిమి బంగారం లాంటి నా సోదరుడి చావు తర్వాత అతడి ఇమేజ్ కు కళంకం తెచ్చే రీతిలో జాతీయ మీడియా ముందుకు వచ్చావు. దేవుడు నువ్వు చేసేవాటిని చూడడం లేదనుకుంటున్నావేమో! నాకు దేవుడిపై నమ్మకం ఉంది. నిన్ను ఆ భగవంతుడు ఏ విధంగా చూస్తాడో నేను చూడాలనుకుంటున్నాను. ఇష్టంలేకపోయినా అతడిని మత్తుపదార్థాలకు బానిసలా మార్చడం, ఆపై నీ పరిస్థితి ఏమీ బాగాలేదని నమ్మించి అతడిని మానసిక వైద్యులకు వద్దకు తీసుకెళ్లడం... మరీ ఇంత నయవంచనా? నువ్వు చాలానే చేశావు" అంటూ శ్వేతా సింగ్ కీర్తి నిప్పులు చెరిగారు.
Shweta Singh Kirti
Rhea Chakraborty
Sushant Singh Rajput
Death
Bollywood

More Telugu News