H.Vasanthakumar: కన్యాకుమారి ఎంపీని బలిగొన్న కరోనా మహమ్మారి
- విషాదంలో తమిళనాడు కాంగ్రెస్ వర్గాలు
- ఆగస్టు 10న ఆసుపత్రిలో చేరిన వసంతకుమార్
- పరిస్థితి విషమించడంతో కన్నుమూత
దేశంలో కరోనా రక్కసి ప్రభావానికి మరో రాజకీయనేత బలయ్యాడు. కన్యాకుమారి ఎంపీ, కాంగ్రెస్ నేత హెచ్. వసంతకుమార్ కరోనాతో కన్నుమూశారు. వసంతకుమార్ తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గానూ వ్యవహరిస్తున్నారు. వసంతకుమార్ వయసు 70 సంవత్సరాలు. ఆయనకు కరోనా సోకడంతో ఆగస్టు 10న చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆపై పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆయనకు ఎక్మో సాయంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తూ వచ్చారు.
ఆరోగ్యం మరీ క్షీణించడంతో వసంతకుమార్ నేడు తుదిశ్వాస విడిచారు. ఆయన భార్య కూడా కరోనాతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. కాగా, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్... వసంతకుమార్ కు బంధువు.
వసంతకుమార్ మృతికి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ
కరోనాతో కన్యాకుమారి ఎంపీ హెచ్. వసంతకుమార్ అకాలమరణం చెందారన్న వార్త తమను తీవ్రంగా కలచివేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. వసంతకుమార్ ఇకలేరన్న వార్తతో తాము దిగ్భ్రాంతికి గురయ్యామని తెలిపారు. ప్రజలకు సేవ చేయాలన్న కాంగ్రెస్ భావజాలానికి అనుగుణంగా ఆయన చేసిన సేవలు తమ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాయని రాహుల్ కీర్తించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని తన ట్వీట్ లో పేర్కొన్నారు.