Press Council of India: సుశాంత్ కేసులో మీడియా సమాంతర విచారణ చేయొద్దు!: ప్రెస్ కౌన్సిల్ హితవు
- రెండు నెలల కిందట సుశాంత్ మరణం
- మీడియాలో విపరీత స్థాయిలో కథనాలు
- పాత్రికేయ నియమావళికి కట్టుబడాలన్న ప్రెస్ కౌన్సిల్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారంపై జాతీయస్థాయి మీడియా విపరీతమైన ఆసక్తితో తీవ్రస్థాయిలో కథనాలు వెలువరిస్తుండడం తెలిసిందే. మీడియాలో కొన్ని వర్గాలు రియా చక్రవర్తి తదితరుల ఇంటర్వ్యూలు తీసుకుంటుండగా, మరికొన్ని ప్రసార సంస్థలు సుశాంత్ కుటుంబ సభ్యుల కథనాలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తున్నాయి.
దీనిపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పందించింది. విచారణలో ఉన్న సుశాంత్ కేసుకు సంబంధించిన కథనాలు ప్రచురించే విషయంలోనూ, ప్రసారం చేసే విషయంలోనూ పాత్రికేయ నియమావళికి కట్టుబడి ఉండాలని మీడియాకు స్పష్టం చేసింది. అంతేకాకుండా, సుశాంత్ వ్యవహారంలో మీడియా సొంతంగా సమాంతర విచారణ చేయడం మానుకోవాలని హితవు పలికింది.