Rafale Jets: సెప్టెంబరు 10న అధికారికంగా వాయుసేనలో చేరనున్న రాఫెల్ జెట్స్
- హర్యానాలోని అంబాలాలో కార్యక్రమం
- ఫ్రెంచ్ రక్షణ మంత్రిని ఆహ్వానించనున్న ప్రభుత్వం
- ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న రాజ్‌నాథ్
ఇటీవలే భారత్ చేరుకున్న అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చే నెలలో అధికారికంగా భారత వాయుసేన (ఐఏఎఫ్)లో చేరనున్నాయి. సెప్టెంబరు 10న హర్యానాలోని అంబాలాలో జరగనున్న ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఫ్రెంచ్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్‌ను ప్రభుత్వం ఆహ్వానించనుంది. ఈ కార్యక్రమానికి భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు.
రాజ్‌నాథ్ ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్నారు. వచ్చే నెల 4 నుంచి 6 వరకు రష్యాలో జరగనున్న షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల రక్షణ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం భారత్ తిరిగి వచ్చి ఐఏఎఫ్ నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొని రాఫెల్ యుద్ధవిమానాలను వాయుసేనలో చేర్చనున్నారు.
కాగా, ఫ్రాన్స్ నుంచి మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాలు రావాల్సి ఉండగా, తొలి విడతగా జులై 29న ఐదు విమానాలు భారత్‌కు చేరుకున్నాయి. రెండో విడతలో భాగంగా మరో నాలుగు యుద్ధ విమానాలు ఈ ఏడాది అక్టోబరులో భారత్‌కు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.