Anantapur District: బంగారం పెట్టలేదని.. పెళ్లయిన పది నిమిషాలకే వరుడు పరార్!
- అనంతపురంలోని కదిరిలో ఘటన
- దగ్గరుండి పెళ్లి జరిపించిన ఇరు కుటుంబాల పెద్దలు
- తాళి కట్టి వెళ్లిపోయి బలవంతపు పెళ్లంటూ పోలీసులకు వరుడి ఫిర్యాదు
పెళ్లిలో మూడు తులాల బంగారం పెడతామని హామీ ఇచ్చి, ఆపై మోసం చేశారని ఆరోపిస్తూ వధువు మెడలో మూడుముళ్లు వేసిన పది నిమిషాలకే వరుడు అదృశ్యమయ్యాడు. అనంతపురం జిల్లాలోని కదిరి మండలంలో జరిగిందీ ఘటన.
తలుపుల మండలంలోని ఓబులరెడ్డిపల్లికి చెందిన చిన్నా అనే యువకుడికి కదిరికి చెందిన తన అక్క కుమార్తెతో వివాహం నిశ్చయమైంది. నిన్న ఉదయం ముత్యాలచెరువు పంచాయతీ పరిధిలోని పాలబావి సాసవల చిన్నమ్మ ఆలయం వద్ద వీరి వివాహం జరిగింది. పెళ్లి కుమార్తెకు తల్లిదండ్రులు, వరుడికి తండ్రి లేకపోవడంతో ఇరు కుటుంబాలకు చెందిన బంధువులే వీరి వివాహాన్ని జరిపించారు.
పెళ్లి సందర్భంగా మూడు తులాల బంగారం పెడతామని మాటిచ్చిన వధువు బంధువులు డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో బంగారం పెట్టలేకపోయారు. దీంతో కినుక వహించిన వరుడు చిన్నా వధువు మెడలో తాళి కట్టిన పది నిమిషాలకే అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత పోలీసు అత్యవసర నంబరు 100కు డయల్ చేసి తనకు తన వాళ్లు బలవంతంగా వివాహం జరిపించారని ఫిర్యాదు చేశాడు.
స్పందించిన పోలీసులు చిన్నాను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి వధువు తరపు వారిని పిలిపించారు. అమ్మాయి మైనర్‌గా కనిపిస్తుండడంతో ఐసీడీఎస్ అధికారులకు పోలీసులు సమాచారం అందించారు. అనంతరం ఇరు కుటుంబాల వారికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.