Congress: ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ కు మరో లేఖ రాసిన కాంగ్రెస్

Congress shot another letter to Facebook CEO Mark Zuckerberg
  • బీజేపీతో 'ఫేస్ బుక్' కుమ్మక్కుపై ఏంచర్యలు తీసుకున్నారంటూ లేఖ
  • న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్న కాంగ్రెస్
  • వాట్సాప్ పై బీజేపీ పట్టుసాధించిందన్న రాహుల్ గాంధీ
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ కు కాంగ్రెస్ పార్టీ మరోసారి లేఖాస్త్రం సంధించింది. ఫేస్ బుక్ ఇండియా విభాగం అధికార బీజేపీకి కొమ్ము కాస్తోందంటూ అంతర్జాతీయంగా వస్తున్న విమర్శలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ఆ లేఖలో మార్క్ జుకర్ బర్గ్ ను ప్రశ్నించింది. నెల రోజుల వ్యవధిలో కాంగ్రెస్ పార్టీ ఫేస్ బుక్ యాజమాన్యానికి లేఖ రాయడం ఇది రెండోసారి.

బీజేపీ, ఫేస్ బుక్ ఇండియా విభాగం మధ్య క్విడ్ ప్రో కో నెలకొందని, పక్షపాత ధోరణులు కూడా కనిపిస్తున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ అంతర్జాతీయ మీడియాలో ప్రచురితమైన ఓ కథనాన్ని ఉటంకిస్తూ విమర్శల దాడి చేస్తోంది. టైమ్ మ్యాగజైన్ లో బీజేపీ-ఫేస్ బుక్ ఇండియా కుమ్మక్కు గురించి సవివరంగా రాశారని, ఈ అంశాన్నే గత ఉత్తరంలోనూ పేర్కొన్నామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరిట రాసిన ఆ తాజా లేఖలో పేర్కొన్నారు.

ఓ విదేశీ సంస్థ దేశంలో సామాజిక సమగ్రతకు భంగం కలిగించడాన్ని సహించలేమని, దీనిపై చట్టపరమైన, న్యాయపరమైన చర్యల దిశగా ఆలోచిస్తున్నామని కూడా ఆ లేఖలో స్పష్టం చేశారు. అటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ట్విట్టర్ లో ఇదే అంశంపై స్పందించారు. అమెరికాకు చెందిన టైమ్ మ్యాగజైన్ వాట్సాప్-బీజేపీ లోపాయికారీ ఒప్పందాన్ని బట్టబయలు చేసిందని తెలిపారు.

"వాట్సాప్ ను 40 కోట్ల మంది భారతీయులు ఉపయోగిస్తున్నారు, వాట్సాప్ పేమెంట్స్ సేవలు కూడా అందించాలనుకుంటోంది. అందుకు మోదీ ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఆ విధంగా బీజేపీ వాట్సాప్ పై పట్టు సాధించింది" అంటూ ఆరోపించారు. వాట్సాప్ మాతృసంస్థ ఫేస్ బుక్ అన్న విషయం తెలిసిందే. అందుకే కాంగ్రెస్ పార్టీ నేరుగా ఫేస్ బుక్ యాజమాన్యాన్నే ప్రశ్నిస్తోంది.
Congress
Facebook
Mark Zuckerberg
Letter
BJP
Whatsapp
TIME Magazine

More Telugu News