Revanth Reddy: ఏపీ మంత్రి కంపెనీ నిర్వాకాన్ని పోలీసు పహారాతో దాచే ప్రయత్నం చేస్తున్నారు: రేవంత్ రెడ్డి
- కొండపోచమ్మ సాగర్ లో వంతెన కూలిందన్న రేవంత్
- అవినీతి ఆనవాళ్లు అనంతం అంటూ వ్యాఖ్యలు
- సిగ్గు సిగ్గు అంటూ ట్వీట్
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్ లోనూ అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు ఆరోపించారు. కొన్నాళ్ల కిందట కాలువలకు గండ్లు పడినప్పుడు కొండపోచమ్మ కథలు అంటూ విమర్శల పర్వం మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి, ఆ విమర్శలను కొనసాగిస్తున్నారు. తాజాగా కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ గేట్ల వద్దకు వెళ్లే వంతెన కుప్పకూలిందని వెల్లడించారు. వంతెన పరిస్థితి అప్పుడెలా ఉంది, ఇప్పుడెలా ఉంది అంటూ ఫొటోలతో వివరించారు.
కేసీఆర్ స్వహస్తాలతో ప్రారంభించిన కొండపోచమ్మ సాగర్ లో అవినీతి ఆనవాళ్లు అనంతం అని రేవంత్ రెడ్డి విమర్శించారు. నిన్న కట్టలు తెగి నీళ్లు ఊళ్ల మీదికి ప్రవహిస్తే, నేడు రిజర్వాయర్ గేట్ల వద్దకు వెళ్లే వంతెన కూలిపోయిందని తెలిపారు. ఏపీ మంత్రికి చెందిన కంపెనీ నిర్వాకాన్ని పోలీసు పహారాతో దాచిపెట్టే కుయత్నానికి పాల్పడుతున్నారని, సిగ్గు సిగ్గు అంటూ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.