Sunny Leone: వరుసగా మూడో రోజూ కాలేజ్ మెరిట్ లిస్ట్ లో సన్నీలియాన్... తలపట్టుకున్న అధికారులు!
- పలు కాలేజీల్లో సన్నీ లియాన్ పేరు
- ఆన్ లైన్ లో అడ్మిషన్ల ప్రక్రియే కారణం
- విచారణ ప్రారంభించిన సైబర్ సెల్
బాలీవుడ్ నటి, మాజీ పోర్న్ స్టార్ సన్నీలియాన్ పేరు కోల్ కతాలోని ఓ కాలేజ్ మెరిట్ లిస్ట్ లో కనిపించిన సంగతి తెలిసిందే. వెంటనే ఆమె పేరును అధికారులు తొలగించారు. అయినా హ్యాకర్లు మరోసారి ఆమె పేరును జోడించారు. దీంతో మూడవ రోజు కూడా కాలేజ్ మెరిట్ లిస్ట్ లో ఆమె పేరు కనిపించడంతో తలపట్టుకున్న అధికారులు, నిందితులను గుర్తించేందుకు పోలీసులను ఆశ్రయించారు. కోల్ కతాలోని బరాసత్ గవర్నమెంట్ కాలేజీలో టాపర్స్ జాబితాలో ఇంగ్లీష్ హానర్స్ జాబితాలో సన్నీ లియాన్ పేరు టాప్-3లో ఉంది.
యూఎస్ పార్న్ స్టార్ డానీ డానియల్స్, ఆపై మియా ఖలీఫా తరువాత సన్నీ పేరును జోడించారు.అధికారులు తొలగించినా, ఆ పేర్లను తిరిగి జోడించారు. వాళ్ల అప్లికేషన్ల నంబర్లతో సహా ఈ జాబితా కనిపిస్తుండగా, తప్పు చేసిన వారిని గుర్తించేందుకు కాలేజీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో , వారు ఎఫ్ఐఆర్ దాఖలు చేసి, విచారణ ప్రారంభించారు.
ఇక కాలేజీలో ప్రధాన స్టూడెంట్స్ యూనియన్ గా ఉన్న తృణమూర్ చాహాత్ర పరిషద్, విడిగా మరో ఫిర్యాదు చేస్తూ, నిందితులను తక్షణమే గుర్తించాలని, లేకుంటే విద్యా వ్యవస్థను తీవ్రంగా అవమానించినట్లేనని పేర్కొంది. కాగా, శుక్రవారం నాడు సన్నీలియాన్ పేరు, సౌత్ 24 పరగణాల జిల్లాలోని బుడ్గే బుడ్గే కాలేజీలో బీఏ హానర్స్ కు సెలక్ట్ అయిన 157 మందిలో 151వ పేరుగా కనిపించింది. అంతకుముందు అమె పేరు అశుతోశ్ కాలేజీలోని మెరిట్ లిస్ట్ లోనూ కనిపించింది. దీనిపై కాలేజీ యాజమాన్యం సైబర్ సెల్ పోలీసులను కూడా ఆశ్రయించింది.
ఇదిలావుండగా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఇటువంటి ఘటనలు జరిగేందుకు కారణం అవుతున్నాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ పూర్తిగా ఆన్ లైన్ మాధ్యమంగానే నిర్వహించాలని మమతా బెనర్జీ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే.దీనికోసం ప్రాసెసింగ్ రుసుములను వసూలు చేయబోమని కూడా ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇదే నిందితులకు వరంగా మారిందని, తప్పుడు సర్టిఫికెట్లతో ఈ పనులు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.