Chandighad: లాక్ డౌన్ తరువాత తొలిసారి... చండీగఢ్ లో తిరిగి ప్రారంభం కానున్న బార్లు!
- మార్చిలో మూతపడిన బార్లు, పబ్బులు
- ఆన్ లాక్ లో భాగంగా కొత్త విధి విధానాలు
- కీలక నిర్ణయం తీసుకున్న పంజాబ్ అధికారులు
ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న అన్ లాక్ 4.0లో రాత్రిపూట కర్ఫ్యూను పూర్తిగా తొలగించడంతో పాటు బార్ అండ్ రెస్టారెంట్లను, క్లబ్బులను తిరిగి ప్రారంభించాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సోమవారం నాడు ఉత్తర్వులు వెలువడతాయని అధికార వర్గాలు వెల్లడించాయి. తొలుత చండీగఢ్ పరిధిలో వీటి ప్రారంభానికి అనుమతిస్తారని సమాచారం. మార్చి మూడవ వారంలో లాక్ డౌన్ ప్రారంభం కాగానే, దేశవ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్ లు పబ్ లు, క్లబ్ లు మూతబడిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఏ రాష్ట్రంలోనూ ఇవి తిరిగి తెరచుకోలేదు.
కాగా, తాజా అన్ లాక్ విధివిధానాల్లో భాగంగా, సాంఘిక, విద్యా, క్రీడా, వినోద, సాంస్కృతిక, మతపరమైన, రాజకీయ కార్యక్రమాలను 100 మందికి మించకుండా ఆహ్వానితులతో సెప్టెంబర్ 21 తరువాత నిర్వహించుకోవచ్చని, ప్రతి ఒక్కరూ మాస్క్ లను తప్పనిసరిగా ధరించాలని కేంద్ర హోమ్ శాఖ ఆదేశించిన సంగతి తెలిసిందే.