Bhumana Karunakar Reddy: ప్రధాని హత్యకు కుట్రపన్నిన వ్యక్తిని సమర్థించడం నా ఉద్దేశం కాదు, అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధుడని జాలిచూపమన్నాను: భూమన
- వరవరరావును విడుదల చేయాలంటూ భూమన లేఖ
- తీవ్రంగా తప్పుబట్టిన సునీల్ దేవధర్
- ఆసుపత్రి నుంచే ప్రకటన చేసిన భూమన
వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రస్తుతం కరోనాకు చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆసుపత్రిలో ఉంటూనే ఓ అంశంలో తన వివరణ ఇచ్చారు. ఇటీవల భూమన.... భీమా కోరేగావ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విరసం నేత వరవరరావును ఆరోగ్య కారణాల రీత్యా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. దీన్ని బీజేపీ ఏపీ వ్యవహారాల సహ ఇన్చార్జి సునీల్ దేవధర్ తప్పుబట్టారు.
ఓవైపు సీఎం జగన్ ప్రధాని మోదీని కలిసి ఆయనతో తీయించుకున్న ఫొటోలను పోస్టు చేస్తుంటారని, మరోవైపు, భూమన వంటి నేతలు మోదీ హత్యకు కుట్రపన్నిన కరడుగట్టిన నక్సలైటు వరవరరావును విడుదల చేయాలని కోరుతుంటారని, ఈ డబుల్ గేమ్ ఆపాలని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సునీల్ దేవధర్ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ పై భూమన తాజాగా స్పందిస్తూ.... ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నిన వ్యక్తిని సమర్థించడం తన ఉద్దేశం కాదని, కానీ అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధుడి పట్ల మానవతా దృక్పథంతో జాలి చూపించమన్నానని వివరించారు. "వరవరరావు, నేను, ఉపరాష్ట్రప్రతి వెంకయ్యనాయుడు జైలులో కలిసి ఉన్నాం కాబట్టే, నేను ఉపరాష్ట్రపతికి లేఖ రాశాను. కానీ నా అభిప్రాయాన్ని సీఎంతో ముడిపెడుతూ ట్వీట్ చేయడం బాధ కలిగించింది" అంటూ భూమన ఓ ప్రకటన వెలువరించారు.