Woman: భర్త పాస్ పోర్టుతో ప్రియుడ్ని ఆస్ట్రేలియా టూర్ కి తీసుకెళ్లిన మహిళ

Woman forged husband passport and toured in Australia with her lover

  • ఉత్తరప్రదేశ్ లో ఘటన
  • జనవరిలో ప్రియుడితో కలిసి ఆస్ట్రేలియా వెళ్లిన మహిళ
  • లాక్ డౌన్ తో అక్కడే చిక్కుకుపోయిన వైనం

ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ కు చెందిన ఓ మహిళ (36) ప్రియుడితో విదేశీ విహారం కోసం భర్త (46) పేరిట మంజూరైన పాస్ పోర్టును వినియోగించుకుంది. ఆ మహిళ జనవరి 6న తన ప్రియుడు సందీప్ సింగ్ తో కలిసి ఆస్ట్రేలియా వెళ్లింది. వారు మార్చిలో భారత్ తిరిగి రావాల్సి ఉండగా, కరోనా ప్రభావంతో అన్ని అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. దాంతో వారిద్దరూ ఆస్ట్రేలియాలోనే చిక్కుకుపోయారు. ఇటీవల వందేభారత్ మిషన్ లో భాగంగా ఓ విమానంలో ఆగస్టు 24న భారత్ చేరుకున్నారు.

ఈ నేపథ్యంలో ఆ మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య సందీప్ సింగ్ అనే వ్యక్తితో  అక్రమసంబంధం కొనసాగిస్తోందని, తన పేరిట పాస్ పోర్టు తీసుకునేందుకు ఫోర్జరీకి పాల్పడిందని ఆరోపించాడు. కాగా, ఆ వ్యక్తి ముంబయిలో ఉద్యోగం చేస్తుండగా, భార్య సొంతూళ్లో వ్యవసాయ భూమిని చూసుకుంటూ ఫాంహౌస్ లో ఉంటోంది. వారి పిల్లల్లో ఒకరు ఆస్ట్రేలియాలో చదువుకుంటున్నారు. ఆ వ్యక్తి గత 20 ఏళ్లుగా ముంబయిలోనే ఉంటూ అడపాదడపా భార్య వద్దకు వచ్చిపోతుండేవాడు.

మే 18న అతను స్వగ్రామానికి రాగా భార్య ఇంటి వద్ద లేకపోవడం గమనించాడు. ఆమె ప్రియుడు సందీప్ తో కలిసి ఆస్ట్రేలియా వెళ్లినట్టు తెలుసుకున్నాడు. అయితే సందీప్ తన పేరుమీద ఫోర్జరీ డాక్యుమెంట్లతో పాస్ పోర్టు పొందాడేమోనన్న అనుమానం కలిగింది. అందుకే ఉద్దేశపూర్వకంగా... పాస్ పోర్టుకు దరఖాస్తు చేసుకున్నాడు.

అయితే అప్పటికే అతడి పేరు మీద ఓ పాస్ పోర్టు ఉందని, మరో పాస్ పోర్టు ఇవ్వలేమని పాస్ పోర్టు కార్యాలయం అధికారులు చెప్పారు. దాంతో అతడి అనుమానం నిజమైంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోంది. ఒక వ్యక్తి పేరుమీద మరో వ్యక్తికి పాస్ పోర్టు ఎలా వచ్చిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తుపై దృష్టి సారించారు.

  • Loading...

More Telugu News