Girl: తల్లిని, సోదరుడ్ని కాల్చిచంపిన లక్నో బాలికకు ఈ పాత్రే స్ఫూర్తి!

More details about Lucknow shooter who killed her mother and brother

  • జపాన్ నవలలోని పాత్రలో తనను తాను ఊహించుకున్న బాలిక
  • మనిషిగా అనర్హురాలినయ్యానంటూ అద్దంపై రాతలు
  • బాలిక గది నుంచి పుర్రె బొమ్మ స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ జాతీయ స్థాయి మహిళా షూటర్ అత్యంత తీవ్ర పరిస్థితుల్లో తల్లిని, సోదరుడ్ని కాల్చిచంపడం సంచలనం సృష్టించింది. 14 ఏళ్ల ఆ బాలిక లక్నోలోని తన నివాసంలో తల్లి, సోదరుడు నిద్రిస్తుండగా, నేరుగా వారి నుదుటిపై కాల్చి వారిని అంతమొందించింది. ఆమె మానసిక పరిస్థితి సరిగా లేనందునే ఈ ఘాతుకాలకు పాల్పడ్డట్టు పోలీసులు ప్రాథమికంగా తెలుసుకున్నారు. అయితే, పోలీసులు విచారణలో ఆ బాలిక నుంచి ఆసక్తికర సమాచారం రాబట్టారు.

జపాన్ రచయిత ఒసాము దజాయ్ రాసిన నవలలోని ఓ పాత్రను ఆ బాలిక బాగా ఇష్టపడేది. ఒసాము దజాయ్... ఎంతో విప్లవాత్మక, విపరీత భావాలున్న రచయిత! సమాజం నుంచి దూరంగా వెళ్లిపోవడం, సమాజాన్ని వెలివేయడం, ఒంటరిగా బతకడం వంటి అంశాలు దజాయ్ రచనల్లో కనిపిస్తాయి. దజాయ్ రాసిన లాంగర్ హ్యూమన్ అనే ఓ నవలలో ఒబా యోజో అనే పాత్ర ఉంటుంది. ఈ పాత్రనే లక్నో బాలిక తనకు తాను అన్వయించుకోవడమే కాకుండా, ఆ పాత్రలో తనను ఊహించుకునేది.

ఆ నవలలో ఒబా యోజో పాత్ర మనిషిగా మారడంలో విఫలమవుతుంది. ఈ బాలిక కూడా తాను మనిషిగా మారలేకపోతున్నానని తరచుగా మనస్తాపం చెందుతూ, డిప్రెషన్ కు లోనయ్యేది. మనిషి కాలేకపోతున్నామంటే మానవుడిగా విఫలమవుతున్నట్టే అని తన నోటు పుస్తకాల్లో రాసుకునేది. ఇలాంటి పరిస్థితుల్లో బతకడం వ్యర్థమని భావించిన ఆ బాలిక తీవ్ర నిర్ణయం తీసుకుంది.

శనివారం మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం తల్లి, సోదరుడు నిద్రకు ఉపక్రమించారు. బాలిక స్నానం చేసి, ఫ్రూట్ జామ్ తో అద్దంపై నేను మనిషిగా అనర్హురాలినయ్యాను అంటూ రాసింది. మొదట బాత్రూంలో ఉన్న అద్దాన్ని తుపాకీతో కాల్చింది. ఆపై నిద్రిస్తున్న తల్లి, సోదరుడికి గురిపెట్టి కాల్చేసింది.

కాగా, ఆ బాలిక గది నుంచి పోలీసులు ఓ పుర్రె బొమ్మను, కొన్ని వికృత ఆకారాల ఫొటోలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ బాలిక చదివిన స్కూలు టీచర్లు ఆమెను ఎంతో ప్రతిభావంతురాలైన విద్యార్థినిగా పేర్కొన్నారు. పైగా జాతీయస్థాయిలో షూటింగ్ పోటీల్లో పాల్గొని గుర్తింపు సంపాదించుకుంది.

  • Loading...

More Telugu News