Suresh Raina: సురేశ్ రైనా ఐపీఎల్ నుంచి తప్పుకున్న కారణం ఇదేనట!.. విజయ గర్వం తలకెక్కిందన్న సీఎస్‌కే యజమాని
- హోటల్ గది విషయంలో రైనా అసంతృప్తి
- బంధువు మరణాన్ని సాకుగా చూపి స్వదేశానికి
- ఇలాంటి వాళ్లు తమకు అవసరం లేదన్న శ్రీనివాసన్
ఐపీఎల్ నుంచి సీనియర్ ప్లేయర్ సురేశ్ రైనా తప్పుకోవడం వివాదాస్పదమైంది. తన జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)కు రైనా దూరం కావడం వెనక పలు కారణాలున్నాయని ఇప్పటి వరకు వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. హోటల్ రూము విషయంలో తలెత్తిన విభేదాల వల్లే రైనా అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నాడని మరో వార్త వెలుగులోకి వచ్చింది. దీనికి అతడు తన బంధువు మరణాన్ని సాకుగా చూపి స్వదేశానికి చేరుకున్నాడని ఆ వార్తల సారాంశం.
అయితే, అసలు కారణం అదికాదని, దుబాయ్‌లో తనకు కేటాయించిన హోటల్ రూము విషయంలో రైనా తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని, ఆ రూములో తనకు బాల్కనీ లేదని, ధోనీకి కేటాయించిన లాంటి గది కావాలని యాజమాన్యంతో గొడవకు దిగినట్టు చెబుతున్నారు. ఈ విషయంలో ధోనీ కూడా రైనాపై మండిపడ్డాడని సమాచారం.
మరోవైపు, జట్టులో కరోనా కేసులు వెలుగు చూడడంతోపాటు, క్వారంటైన్‌లో ఉండేందుకు రైనా బాగా ఇబ్బంది పడ్డాడని తెలుస్తోంది. అయితే, రైనా మాత్రం పిల్లల కంటే మరేదీ తనకు ముఖ్యం కాదని, అందుకే ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్టు తన సహచరులతో చెప్పినట్టు సమాచారం.
రైనా నిష్కృమణపై సీఎస్‌కే యజమాని శ్రీనివాసన్ పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎస్‌కే అనేది ఓ కుటుంబమని, ఎలా సర్దుకుపోవాలో సీనియర్లు నేర్చుకోవాలని అన్నారు. మొండిగా వ్యవహరించేవాళ్లు తమకు అవసరం లేదని, నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చని తేల్చి చెప్పారు. విజయగర్వం తలకెక్కిందని రైనాను ఉద్దేశిస్తూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.