India: ఇండియాలో రికార్డు స్థాయి కరోనా కేసులకు కారణమిదే!
- రోజుకు 75 వేలకు పైగా కేసులు
- పరీక్షల సంఖ్య గణనీయంగా పెరిగిందంటున్న నిపుణులు
- ప్రజలు కరోనా భయాన్ని మరచి తిరుగుతున్నారు
- తదుపరి అన్ లాక్ కేసుల సంఖ్య మరింత పెరుగుదల
ఇండియాలో కరోనా మహమ్మారి విజృంభణ మరింత వేగవంతమైంది. రోకు 75 వేల కేసులకు పైగా నమోదవుతున్నాయి. ఆదివారం నాటి గణాంకాల ప్రకారం, 24 గంటల వ్యవధిలో 78,761 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 35 లక్షలను దాటేసింది. ఇదే సమయంలో వరుసగా నాలుగు రోజుల పాటు ఇండియాలో రోజువారీ కొత్త కేసుల విషయంలో కొత్త రికార్డులు నమోదయ్యాయి. ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు తిరిగి తెరచుకుంటూ ఉండటం, పరీక్షల సంఖ్య గణనీయంగా పెరగడమే ఇందుకు కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదే సమయంలో మాస్క్ లను ధరించకుండా బయట తిరుగుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉండటం, ప్రజల జీవన విధానంలో మార్పు రావడం, కరోనాపై భయాన్ని మరచిపోయి తిరుగుతూ ఉండటం కూడా కేసుల సంఖ్యను పెంచుతోందని ఐసీఎంఆర్ అంటువ్యాధుల విభాగం చీఫ్ డాక్టర్ సమీరన్ పాండా అంచనా వేశారు. ఇక రేపటి నుంచి ప్రారంభం కానున్న నాలుగో దశ అన్ లాక్ లో కేసుల సంఖ్య మరింతగా పెరిగిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మెట్రో రైళ్లను నడిపించుకునేందుకు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో కరోనా విస్తృతి మరింతగా పెరుగుతుందని, రోజుకు 15 లక్షల మంది ప్రయాణించే ఢిల్లీ మెట్రో, తిరిగి ప్రారంభమైతే కేసుల సంఖ్య కూడా అంతే భారీగా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఇక హోటల్స్, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, మతపరమైన కేంద్రాలు, జిమ్ లు... ఇలా అన్నీ తిరిగి తెరవనుండటంతో మహమ్మారి మరింతగా విజృంభించే ప్రమాదం ఉందని అంటున్నారు.
"భౌతిక దూరాన్ని పాటించడంతో మాత్రమే కరోనాను ఓడించగలం" అని ప్రధాని నరేంద్ర మోదీ, తన ఆదివారం నాటి మన్ కీ బాత్ లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఒక్కొక్కరి మధ్య రెండు మీటర్ల దూరం పాటించగలిగితే వైరస్ మరొకరి దరిదాపులకు కూడా వెళ్లదని ఆయన అన్నారు. కొత్తగా పెరుగుతున్న కేసుల విషయమై మాత్రం మోదీ ఒక్క కామెంట్ కూడా చేయకపోవడం గమనార్హం.