Nalgonda District: లైంగిక వేధింపులు, చిత్రహింసలకు గురయ్యాను.. సెలబ్రిటీలు మాత్రం అందులో లేరు: మిర్యాలగూడ అత్యాచార బాధిత యువతి
- 139 మంది అత్యాచారం చేశారంటూ ఇటీవల ఫిర్యాదు
- డాలర్ బాయ్ ఒత్తిడి మేరకే ఫిర్యాదు చేశాను
- నా వల్ల ఇబ్బందులు పడ్డవారికి క్షమాపణలు చెబుతున్నా
- నాపై అత్యాచారం జరిగింది మాత్రం నిజమే
తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఓ యువతి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆమె ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశంలో మరోలా మాట్లాడింది. డాలర్ బాయ్ ఒత్తిడి మేరకే తాను పోలీసులకు అలా ఫిర్యాదు చేశానని చెప్పింది.
కొంత మందితో తనకు ఎలాంటి సంబంధం లేదని తాను ఎంత చెప్పినా వినకుండా అనవసరంగా ఆ కేసులో డాలర్ బాయ్ ఆ పేర్లను రాయించాడని తెలిపింది. తనను, తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడని, చిత్ర హింసలకు గురి చేశాడని తెలిపింది. తనపై అత్యాచారం జరిగింది నిజమే కానీ, ఇందులో సెలబ్రిటీలు లేరని ఆమె చెప్పింది. యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడులకు అసలు సంబంధం లేదని ఆమె పేర్కొంది.
తాను బయటవారి చేతిలో 50 శాతం వేధింపులకు గురయితే, మరో 50 శాతం వేధింపులకు డాలర్ బాయ్ వల్లే గురయ్యానని చెప్పింది. తన వల్ల ఇబ్బందులు పడ్డవారికి క్షమాపణలు చెబుతున్నానని పేర్కొంది. తనలా మరో అమ్మాయికి అన్యాయం జరగకూడదని, డాలర్ బాయ్ తనలా మరో ఇద్దరిని కూడా ట్రాప్ చేశాడని ఆమె ఆరోపించింది.