Ram Nath Kovind: ఓ శకం ముగిసింది... ప్రణబ్ అస్తమయంపై రాష్ట్రపతి వ్యాఖ్యలు
- అనారోగ్యంతో ప్రణబ్ ముఖర్జీ మృతి
- తీవ్ర విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి కోవింద్
- ఎంతో నిరాడంబరమైన వ్యక్తి అంటూ వ్యాఖ్యలు
సీనియర్ రాజకీయవేత్త, భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తుదిశ్వాస విడిచిన నేపథ్యంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రణబ్ ఇక లేరన్న వార్త ఎంతో బాధ కలిగిస్తోందని, ఆయన మరణంతో ఓ శకం ముగిసినట్టయిందని పేర్కొన్నారు. ఎంతో పవిత్రమైన ఆత్మతో భరత మాతకు సేవలు అందించారని, ప్రజాజీవితంలో సమున్నతంగా నిలిచారని కొనియాడారు. ఎంతో విలువైన తన బిడ్డల్లో ఒకరిని కోల్పోయిన దేశం రోదిస్తోందని వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబానికి, మిత్రులకు, పౌరులందరికీ సంతాపం తెలియజేసుకుంటున్నానని ట్వీట్ చేశారు.
"భారతరత్న ప్రణబ్ ముఖర్జీ సంప్రదాయాన్ని, ఆధునికతను మిళితం చేశారని, ఐదు దశాబ్దాల పాటు ఎంతో ఘనతర రాజకీయ జీవితం గడిపినా, అనేక గొప్ప పదవులు అలంకరించినా, ఆయన ఎప్పుడూ నేలవిడిచి సాము చేయలేదు. ఎంతో నిరాడంబరంగా జీవించారు. రాజకీయ పక్షాలకు అతీతంగా అందరికీ దగ్గరయ్యారు. దేశ ప్రథమ పౌరుడిగా రాష్ట్రపతి భవన్ ను ప్రజలకు దగ్గర చేస్తూ సత్సంప్రదాయాన్ని కొనసాగించారు. హిజ్ ఎక్సలెన్సీ అనే గౌరవప్రదమైన సంబోధనను నిలిపివేయాలని ఆయన తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం" అంటూ కీర్తించారు.