AP High Court: ఏపీ ప్రభుత్వ పథకాల్లో వైఎస్సార్ ఫొటో ఉపయోగించడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- వైఎస్సార్ గతంలో సీఎంగా పనిచేశారన్న హైకోర్టు
- ఆయన ఫొటో పెట్టుకోవడంలో అభ్యంతరం ఏముందని ప్రశ్న
- పిటిషన్ సీజే ధర్మాసనానికి బదిలీ
వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పథకాల ప్రచారంలో వైఎస్సార్ ఫొటో కూడా ఉపయోగించడం జరుగుతోంది. దీన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గతంలో సీఎంగా వ్యవహరించారని, ఆయన ఫొటో పెట్టడంలో అభ్యంతరం ఏముందని ప్రశ్నించింది.
కాగా, ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరాం అభిప్రాయాలు వినిపించారు. పిటిషనర్ టీడీపీ వ్యక్తి అని, చంద్రబాబు హయాంలో పసుపురంగులో ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చారనీ చెబుతూ, కొన్ని ప్రకటనలను కోర్టుకు సమర్పించారు. అనంతరం ఈ పిటిషన్ ను సీజే ధర్మాసనానికి బదిలీ చేస్తున్నామంటూ న్యాయమూర్తులు ప్రకటించారు.