Telangana: తెలంగాణలో 69 శాతం మందిలో లక్షణాలు లేకుండానే కరోనా!
- రాష్ట్రంలో 31 శాతం మందిలో మాత్రమే వైరస్ లక్షణాలు
- లక్షణాలు లేనివారి వల్ల పెరుగుతున్న కేసులు
- తగ్గుతున్న సీరియస్ కేసుల సంఖ్య
తెలంగాణలో కరోనా బారినపడిన వారిలో 31 శాతం మందిలో మాత్రమే కరోనా లక్షణాలు ఉన్నాయని, 69 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా బారినపడినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.
ఇప్పటి వరకు నమోదైన కేసులను విశ్లేషించిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,24,963 మంది కరోనా బారినపడగా వారిలో 86,225 మందిలో ఎటువంటి లక్షణాలు లేవని పేర్కొంది. లక్షణాలు లేని వారు తమకు తెలియకుండానే కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఒకే కుటుంబంలో 15 నుంచి 20 మంది వరకు కరోనా బారినపడుతుండడానికి అదే కారణమని విశ్లేషించింది.
అసింప్టమాటిక్ రోగుల ద్వారా వైరస్ బారినపడిన ప్రాథమిక, సెకండరీ కాంటాక్టులను గుర్తించి పరీక్షలు చేసి వారికి తక్షణమే వైద్యం అందించడం వల్ల చాలా మంది రోగులు త్వరగానే కోలుకున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 31,299 యాక్టివ్ కేసులుంటే అందులో 24,216 మంది హోం ఐసోలేషన్, లేదంటే సంస్థాగత క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నారు. కాగా, ప్రస్తుతం సీరియస్ కేసులు గణనీయంగా తగ్గాయని, ఆసుపత్రులలో పడకలు ఖాళీ అవుతున్నాయని అధికారులు తెలిపారు.