China: భారత్, చైనా పరస్పరం తలపడితే రెండు.. కలిసి డ్యాన్స్ చేస్తే 11: చైనా
- సరిహద్దుల్లో సుస్థిరతకే మా తొలి ప్రాధాన్యం
- మేమెప్పుడూ కవ్వింపులకు పాల్పడలేదు
- చర్చల ద్వారా పరిష్కారానికి మేం సిద్ధం
భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ స్పందించారు. సరిహద్దుల్లో సుస్థిరతకే తమ ప్రాధాన్యమని, తామెప్పుడూ పరిస్థితులు చేయిదాటిపోయేలా ప్రవర్తించలేదని పేర్కొన్నారు. పారిస్‌లోని ప్రఖ్యాత ఫ్రెంచి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో సోమవారం ప్రసంగించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తామెప్పుడూ కవ్వింపు చర్యలకు పాల్పడలేదని, అయితే, తమ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను కాపాడే విషయంలో మాత్రం ముందుంటామని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య సరిహద్దులు నిర్ణయించబడలేదు కాబట్టి ఇలాంటి సమస్యలు సహజమేనని తేలిగ్గా తీరిపారేశారు.
ఉద్రిక్తతలు ఘర్షణలుగా మారేందుకు అవకాశం ఇవ్వకూడదని, చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. భారత్-చైనాలకు అదే శ్రేయస్కరమని పేర్కొన్నారు. డ్రాగన్(చైనా) ఎలిఫెంట్ (భారత్) పరస్పరం తలపడితే 1 ప్లస్ 1= 2 అవుతుందని, అదే రెండూ కలిసి డ్యాన్స్ చేస్తే 1 ప్లస్ 1=11 అవుతుందన్నారు. విభేదాలను పక్కనపెట్టి నడిస్తే ఇరు దేశాల్లోని 2.7 బిలియన్ మంది ప్రజలకు ప్రయోజనం లభిస్తుందని, భారత్‌తో బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు చైనా సిద్ధంగా ఉందని వాంగ్ యీ పేర్కొన్నారు.