Corona Virus: రష్యా, చైనాలు తెచ్చిన వాక్సిన్లలో లోపాలున్నాయంటున్న శాస్త్రవేత్తలు!
- ఇప్పటికే 8.50 లక్షల ప్రాణాలను బలిగొన్న మహమ్మారి
- ఈ వ్యాక్సిన్ 40 శాతమే పనిచేసే అవకాశాలు
- హెచ్చరిస్తున్న ప్రపంచ వైద్య నిపుణులు
కరోనాకు విరుగుడుగా చైనా, రష్యాలు తయారు చేసిన వ్యాక్సిన్ పై ఇప్పుడు కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఈ వ్యాక్సిన్ పనితీరుపై పలు దేశాల శాస్త్రవేత్తలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు వ్యాక్సిన్లూ ఒకే విధమైన విధానంలో తయారయ్యాయి. ఈ వ్యాక్సిన్లను తీసుకున్న వారిలో కరోనా వైరస్ ను నిరోధించే శక్తి పరిమితంగానే ఉందని పలు దేశాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, కాన్ సినో బయోలాజికల్ తయారు చేసిన వ్యాక్సిన్ ను చైనాలో మిలిటరీ అవసరాలకు వినియోగిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ ను సాధారణ జలుబు వైరస్ అయిన అడినోవైరస్ టైప్ 5 లేదా ఏడీ5 ఆధారంగా తయారు చేశారు. ఈ సంస్థ తన వైరస్ టీకాకు అనుమతి తీసుకునే విషయంలో శరవేగంగా అడుగులు వేస్తోందని, ఎమర్జెన్సీ అప్రూవల్స్ తీసుకున్న తరువాత, వివిధ దేశాలతో డీల్స్ కుదుర్చుకోవాలని ప్రయత్నిస్తోందని 'వాల్ స్ట్రీట్ జర్నల్' కథనాన్ని ప్రచురించింది.
ఇక రష్యా విషయానికి వస్తే, మాస్కో కేంద్రంగా పనిచేస్తున్న గమలేయా ఇనిస్టిట్యూట్ ఈ వ్యాక్సిన్ ను గత నెల ప్రారంభంలోనే రిజిస్టర్ చేసింది. ఇది కూడా అడినోవైరస్ ఆధారంగా తయారైనదే. ఈ వ్యాక్సిన్ లు 70 శాతం పనితీరును చూపిస్తాయని చెబుతున్నప్పటికీ అనుమానాలున్నాయి. 'ఓ 40 శాతం వరకూ రోగ నిరోధక శక్తిని పెంచవచ్చని అంచనా వేస్తున్నాం. భారీ ఎత్తున పరీక్షలు జరిగితేనే విషయం తేలుతుంది" అని జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ రీసెర్చర్ అన్నా డర్బిన్ వ్యాఖ్యానించారు.
కాగా, ఈ మహమ్మారి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 8.50 లక్షల ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే. దీన్ని పూర్తిగా రూపుమాపేందుకు ఇవి ఏ మాత్రమూ సరిపడవని పలు దేశాల సైంటిస్టులు భావిస్తున్నారు. గతంలో ఇదే తరహా అడినో వైరస్ ఆధారంగా తయారైన ఎబోలా వ్యాక్సిన్ లకు అనుమతి లభించిన సంగతి తెలిసిందే. అదే తరహా వైరస్ తో తయారైన ఈ వ్యాక్సిన్ ఏ మేరకు పనిచేస్తుందన్న విషయమై ప్రశ్నించినప్పటికీ, అటు గమేలియా, ఇటు కాన్ సినో స్పందించకపోవడం గమనార్హం.