Supreme Court: మారటోరియాన్ని రెండేళ్ల పాటు పొడిగించే అవకాశం.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర సర్కారు
- వడ్డీ మాత్రం చెల్లించాల్సి ఉంటుందన్న కేంద్రం
- వడ్డీపై న్యాయంగా ఆలోచించాలన్న సుప్రీంకోర్టు
- రేపు పూర్తి స్థాయిలో వాదనలు వింటామన్న న్యాయస్థానం
బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారిని ఆదుకునేందుకు కరోనా నేపథ్యంలో మారటోరియం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, మారటోరియం గడువు తర్వాత ఈ సమయానికి వడ్డీ మాత్రం చెల్లించాల్సి ఉంటుందని బ్యాంకులు షరతులు పెట్టాయి. ఈ వడ్డీని మాఫీ చేయాలంటూ వచ్చిన పిటిషన్‌పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించింది. వివిధ రుణాలపై మారటోరియాన్ని ఏకంగా రెండేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉందని, ఈ వ్యవధిలో వడ్డీని పరిగణించే అవకాశం కూడా ఉందని చెప్పింది. అయితే, వడ్డీపై న్యాయంగా ఆలోచించాలని కేంద్ర సర్కారుకి సుప్రీంకోర్టు సూచించింది.
ఈ విషయంలో విచారణపై ఎక్కువ ఆలస్యం చేయదలచుకోలేదని పేర్కొంది. దీనిపై రేపు పూర్తి స్థాయిలో వాదనలు వింటామని చెబుతూ విచారణను రేపటికి వాయిదా వేసింది. కాగా, మారటోరియం వ్యవధిలో రుణాలపై వడ్డీలు వసూలు చేయడంతో రుణాలు తీసుకున్న వారికి లాభమేమీ ఉండబోదని పలువురు ఇప్పటికే కోర్టుకు తెలిపారు.