Pranab Mukherjee: సైనిక లాంఛనాలతో ముగిసిన ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు
- నిన్న సాయంత్రం కన్నుమూసిన ప్రణబ్ ముఖర్జీ
- లోథీ శ్మశానవాటికలో అంత్యక్రియలు
- ప్రణబ్ భౌతికకాయంపై జాతీయజెండా ఉంచిన సైనికులు
రాజనీతి కోవిదుడు, అపార రాజకీయ అనుభవశాలి, భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఢిల్లీలోని లోథీ శ్మశానవాటికలో ఆయనకు పూర్తిస్థాయి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రణబ్ పార్థివదేహంపై జాతీయ పతాకాన్ని ఉంచిన సైనికులు, గౌరవసూచకంగా గాల్లోకి కాల్పులు జరిపారు. కుటుంబ సంప్రదాయం ప్రకారం కుమారుడు అభిజిత్ ముఖర్జీ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు రాజాజీ మార్గ్ నివాసం వద్ద ప్రణబ్ భౌతికకాయాన్ని ప్రముఖులు చివరిసారి సందర్శించి నివాళులు అర్పించారు.
కొన్నివారాల కిందట మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆసుపత్రిలో చేరిన ప్రణబ్ కు శస్త్రచికిత్స నిర్వహించారు. అయితే, ఆ శస్త్రచికిత్స అనంతరం ఆయన పరిస్థితి విషమించింది. అప్పటికి కరోనా కూడా సోకడంతో ప్రణబ్ ఆరోగ్యం మరింత క్షీణించి కోమాలోకి వెళ్లిపోయారు. ఆపై ఇక కోలుకోలేకపోయారు. నిన్న సాయంత్రం ప్రణబ్ తుదిశ్వాస విడిచినట్టు కుమారుడు అభిజిత్ ప్రకటించారు.