Chidambaram: దేవుడిపై నిందలు వేయొద్దు: చిదంబరం
- కరోనా దేవుడి చర్య అన్న నిర్మలా సీతారామన్
- మానవ తప్పిదాలకు దేవుడిపై నింద వేయొద్దన్న చిదంబరం
- పేదల చేతిలో డబ్బు పెట్టడమే ఇప్పుడు మనం చేయాల్సిన పని అని సూచన
కరోనా వల్ల జీఎస్టీ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడిందని, దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిందని... కరోనా అనేది దేవుడి చర్య అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం స్పందిస్తూ, మానవ తప్పదాలకు దేవుడిపై నింద వేయడం సరికాదని అన్నారు. దేశ జీడీపీ ఏకంగా 24 శాతం పతనం కావడం... మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో స్పష్టం చేస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రిలీఫ్ ప్యాకేజీ కూడా 'పెద్ద జోక్' అని ఆయన కొట్టిపారేశారు.
'దేవుడిని నిందించకండి. వాస్తవానికి దేవుడికి మీరే కృతజ్ఞతలు చెప్పాలి. దేశంలోని రైతులను దేవుడు ఆశీర్వదించాడు. వర్షాలు కురిపించాడు. కరోనా అనేది ప్రకృతి సిద్ధంగా వచ్చిన మహమ్మారి' అని చిదంబరం చెప్పారు.
దేశ ఆర్థిక వృద్ధిరేటు వేగంగా పుంజుకుంటుందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కేవీ సుబ్రమణియన్ చేసిన వ్యాఖ్యలపై చిదంబరం విమర్శలు గుప్పించారు. ఆయన వ్యాఖ్యలను ఎవరైనా సీరియస్ గా తీసుకుంటారా? అని ప్రశ్నించారు. చివరిసారిగా ప్రధాని మోదీని ఆయన ఎప్పుడు కలిశారని ఎద్దేవా చేశారు. గత కొన్ని నెలలుగా 'V' షేప్ రికవరీ (మాద్యం తర్వాత ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకోవడం) గురించి ఆయన కలలు కంటున్నారని విమర్శించారు. సుబ్రమణియన్ వెల్లడించిన ప్రతి అంశంతో ఆర్బీఐ తన నివేదికలో విభేదించిందని చెప్పారు.
ఇప్పుడు కావాల్సింది రుణాలు తీసుకోవడం, వాటిని ఖర్చు చేయడమేనని... దాంతో సిస్టమ్ లో డిమాండ్ పెరుగుతుందని చిదంబరం తెలిపారు. పేదల చేతిలో డబ్బు పెడితే, దేశ వ్యాప్తంగా వినిమయం పెరుగుతుందని... ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఇది తోడ్పడుతుందని చెప్పారు.