Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకంలో మార్పులు!
- సబ్సిడీ మొత్తం రైతులకే చెల్లింపు
- స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు నిర్ణయం
- వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కార్యక్రమం ప్రారంభం
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకపై రైతులకు ఉచిత సబ్సిడీని నేరుగా నగదు రూపంలో చెల్లించాలని నిర్ణయించారు. వినియోగానికి సంబంధించిన బిల్లును డిస్కంలకు రైతులే చెల్లించేలా నిబంధనలను మార్చారు. దీనికి సంబంధించి విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.
18 లక్షల రైతులకు ప్రతి ఏటా 12వేల మిలియన్ యూనిట్లను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తోందని ప్రభుత్వం తెలిపింది. ఉచిత విద్యుత్ కు రూ. 8,400 కోట్లు ఖర్చవుతోందని చెప్పింది. పగటి పూట ఉచిత విద్యుత్ ను అందించేందుకు రూ. 1,700 కోట్లతో కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణాలను చేపట్టనున్నట్టు వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపింది.