Mahakaleshwar: మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. శివుడి అనుగ్రహం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానన్న జస్టిస్ అరుణ్ మిశ్రా!
- గర్భగుడిలోకి భక్తులను అనుమతించొద్దు
- లింగాన్ని చేతులతో రుద్దొద్దు
- స్వచ్ఛమైన పాలు, నీటితో అభిషేకం చేయాలి
సాధారణంగా దేవాలయాల గర్భగుడుల్లోకి భక్తులు వెళ్లరు. కానీ, శివాలయాల్లోకి మాత్రం భక్తులు వెళ్లొచ్చు. శివలింగాన్ని స్వయంగా తాకొచ్చు. దీనివల్ల పలు ఆలయాల్లో శివలింగాలు అరిగిపోవడమో, రూపాన్ని మార్చుకోవడమో జరుగుతోంది. ఈ నేపథ్యంలో, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన మహాకాళేశ్వర్ ఆలయానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. శివలింగం క్షీణిస్తున్న నేపథ్యంలో, గర్భగుడిలోకి భక్తుల ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్టు జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది.
లింగాన్ని చేతులతో రుద్దకూడదని... నెయ్యి, పెరుగు, తేనె వంటి వాటితో మర్దన చేయకూడదని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. స్వచ్చమైన పాలు, నీటితోనే అభిషేకం చేయాలని ఆదేశించింది. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ సందర్భంగా జస్టిస్ అరుణ్ మిశ్రా మాట్లాడుతూ, పరమశివుడి అనుగ్రహంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. మరోవైపు, ఈరోజుతో ఆయన పదవీవిరమణ చేస్తున్నారు. గత మూడున్నరేళ్లుగా ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉండటం గమనార్హం.