India: చూస్తుండగానే దుస్సాహసం... 1000 చదరపు కిలోమీటర్లను ఆక్రమించిన చైనా!
- సరిహద్దుల్లో నిరంతర నిఘా ఉన్నా ముందుకే వస్తున్న చైనా
- దెప్సాంగ్ సమీపంలో 900 చదరపు కిలోమీటర్లు చైనా నియంత్రణలోకి
- కేంద్ర ప్రభుత్వ అధికారి తెలిపారంటూ 'ది హిందూ' కథనం
ఓ వైపు చైనా దురాక్రమణలను అడ్డుకునే పనిలో భారత సైన్యం నిరంతరం నిఘా పెట్టి, పోరాడుతూ ఉంటే, ఇప్పటికే ఎల్ఏసీ వెంబడి పలు ప్రాంతాల్లో సుమారు 1000 చదరపు కిలోమీటర్లను చైనా ఆక్రమించేసినట్టు కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారంటూ, 'ది హిందూ' వెబ్ సైట్ ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించడం చర్చనీయాంశమైంది. ఓ వైపు చర్చలంటూనే, మరోవైపు చైనా పీపుల్స్ ఆర్మీ, చాలా ప్రాంతాల్లోకి చొచ్చుకుని వచ్చేసిందని ఆ అధికారి వెల్లడించారట.
వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి దెప్సాంగ్ ప్రాంతం నుంచి చుశుల్ వరకూ ఈ ఆక్రమణలు జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా దెప్సాంగ్ మైదానంలోని 10వ నంబర్ పెట్రోలింగ్ పాయింట్ నుంచి 13వ నంబర్ పాయింట్ వరకూ సుమారు 900 చదరపు కిలోమీటర్లు చైనా అధీనంలోకి వెళ్లిపోయాయని, గాల్వాన్ లోయలో 20 చదరపు కిలోమీటర్లు పాంగ్యాంగ్ సరస్సు వద్ద 65 చదరపు కిలోమీటర్లు, హాట్ స్ప్రింగ్ సమీపంలో 12 చదరపు కిలోమీటర్లు, చుశుల్ వద్ద 20 చదరపు కిలోమీటర్లను చైనా ఆక్రమించిందని ఆ అధికారి వెల్లడించినట్టు 'ది హిందూ' పేర్కొంది.
ప్రస్తుతం చైనా మరిన్ని ప్రాంతాలపై కన్నేసిందని వివరించిన ఆ ఆఫీసర్, పాంగ్యాంగ్ సమీపంలోని ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 మధ్య ఉన్న దాదాపు 8 కిలోమీటర్ల భూమిని ఆక్రమించేందుకు చైనా దళాలు ప్రయత్నిస్తున్నాయని తెలుస్తోంది.