Prakasam District: వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా.. చీరాలలో ఆమంచి, కరణం బలరాం వర్గాల మధ్య వాగ్వివాదం
- చీరాలలో కరణం బలరాం, ఆమంచి వర్గీయుల పోటాపోటీ ఫ్లెక్సీలు
- తొలుత బలరాం వర్గీయులకు అనుమతి ఇచ్చిన పోలీసులు
- పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
ప్రకాశం జిల్లా చీరాలలో నిర్వహించిన వైసీపీ వర్ధంతి కార్యక్రమంలో వైసీపీ నేతలు ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం వర్గీయుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అయితే, పోలీసులు సకాలంలో స్పందించడంతో వివాదం సద్దుమణిగింది. బలరాం, ఆమంచి వర్గీయులు పోటాపోటీగా ఫ్లెక్సీలు కట్టారు. ఏదో జరగబోతోందని ముందే ఊహించిన పోలీసులు అప్రమత్తమయ్యారు. వైఎస్సార్ విగ్రహం వద్ద నిర్వహించాల్సిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కరణం బలరాం వర్గీయులకు ఉదయం అవకాశం ఇవ్వగా, ఆ తర్వాత ఆమంచి వర్గీయులకు అవకాశం ఇచ్చారు.
దీంతో తొలుత ఏఎంసీ చైర్మన్, కార్యకర్తలు వైఎస్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే వేణుగోపాల్ వైఎస్ విగ్రహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమం జరుగుతుండగానే ఆమంచి, కరణం వర్గీయులు కలబడ్డారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. వెంటనే స్పందించిన పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.