Kesineni Nani: ఈ ఫ్లైఓవర్ ను కొంచం మరమ్మతులు చేయించండి ముఖ్యమంత్రి గారూ: కేశినేని నాని
- విజయవాడలోని చనుమోలు వెంకట్రావు ఫ్లైవోవర్‌పై గోతులు
- ఆంధ్రజ్యోతి కథనాన్ని పోస్ట్ చేసిన కేశినేని నాని
- బాగుచేయిస్తే బెజవాడ ప్రజలు రుణ పడి వుంటారని చురక
'రోడ్లపై చాలా చోట్ల గోతులు కనపడతాయి. అయితే, ఫ్లై ఓవర్‌పై గోతులను చూడాలంటే విజయవాడలోని చనుమోలు వెంకట్రావు ఫ్లైవోవర్ (సీవీఆర్)కు వెళ్లాల్సిందే' అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇచ్చిన ఓ కథనాన్ని పోస్ట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కారుపై టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పించారు. ఆ ఫ్లైఓవర్‌ను బాగు చేయాలని ఆయన కోరారు.
'ఈ ఫ్లైఓవర్ ను కొంచం మరమ్మతులు చేయించండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు. మా బెజవాడ ప్రజలు మీకు రుణ పడి వుంటారు' అని కేశినేని నాని ట్వీట్ చేశారు. కాగా, విజయవాడ మీదుగా వెళ్లే ప్రధాన జాతీయ రహదారులను నగరం వెలుపల నుంచి ఇన్నర్ రింగ్ మార్గంలో అనుసంధానించే అతి ముఖ్యమైన ఫ్లైవోవర్ ఇదని, అటువంటి దానిపై రోడ్డు తక్కువగా ఉందని, గోతులు ఎక్కువగా ఉన్నాయని ఆంధ్రజ్యోతి దినపత్రికలో పేర్కొన్నారు. కాంక్రీటు కొట్టుకుపోయి బయటపడిన చువ్వల వల్ల ప్రమాదం పొంచి ఉంటుందని చెప్పారు.