Nara Lokesh: రైతే రాజు అనే రోజు తీసుకొస్తా అని అసలు రైతే లేని రోజు తీసుకొచ్చారు: లోకేశ్
- విత్తనాలు, ఎరువులు ఇవ్వలేక చేతులెత్తేశారంటూ విమర్శలు
- ఇచ్చిన ప్రతి హామీలో మోసం అంటూ ఆగ్రహం
- ఉచిత విద్యుత్ కు మంగళం పాడుతున్నారంటూ వ్యాఖ్యలు
సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. రైతే రాజు అనే రోజు తీసుకొస్తా అని అసలు రైతే లేని రోజు తీసుకొస్తున్నారని లోకేశ్ ట్విట్టర్లో స్పందించారు. వివిధ పథకాల ద్వారా రైతుకు ఏడాదిలో లక్ష రూపాయల మేర లబ్ది చేకూర్చుతాం అని చెప్పి చివరికి విత్తనాలు, ఎరువులు కూడా ఇవ్వలేక అసమర్థ వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేసిందని వ్యాఖ్యానించారు. ఇచ్చిన ప్రతి హామీలో మోసం అని మండిపడ్డారు. ఇప్పుడు ఏకంగా ఉచిత విద్యుత్ పథకానికే మంగళం పాడే ప్రక్రియ మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గడచిన 15 నెలల్లో జగన్ రెడ్డి రైతు వ్యతిరేక నిర్ణయాల వల్లనే ఆత్మహత్యలు భారీస్థాయిలో పెరిగాయని లోకేశ్ ఆరోపించారు. "అన్నదాతల బలవన్మరణాల్లో ఏపీ దేశంలోనే మూడో స్థానంలో ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉంది. ఇకనైనా పబ్లిసిటీ పిచ్చి పక్కనబెట్టి రైతన్నలను కాపాడండి" అని లోకేశ్ హితవు పలికారు.