Suresh Raina: తనపై శ్రీనివాసన్ ఆగ్రహం వ్యక్తం చేయడంపై సురేశ్ రైనా స్పందన!
- యూఏఈ నుంచి వెనక్కి వచ్చిన రైనా
- విజయగర్వం నెత్తికెక్కిందన్న శ్రీనివాసన్
- శ్రీనివాసన్ తనకు తండ్రి సమానులన్న రైనా
ఐపీఎల్ కోసం యూఏఈకి వెళ్లి, ఆ వెంటనే ఇండియాకు తిరిగొచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) బ్యాట్స్ మెన్ సురేశ్ రైనా తాజాగా మాట్లాడుతూ, తనకు, సీఎస్కే ఫ్రాంఛైజీ యాజమాన్యానికి మధ్య ఎలాంటి విభేదాలు లేవని అన్నాడు. తన కుటుంబం కోసం తాను వెనక్కి రావాల్సి వచ్చిందని చెప్పాడు. సీఎస్కే కూడా తనకు మరో కుటుంబం వంటిదని... ధోనీ భాయ్ తనకు చాలా ముఖ్యమైన వ్యక్తి అని తెలిపాడు. వెనక్కి రావాలని తాను తీసుకున్న నిర్ణయం చాలా కఠినమైనదని అన్నాడు. క్రిక్ బజ్ తో మాట్లాడుతూ రైనా ఈ మేరకు స్పందించాడు.
ఐపీఎల్ కోసం క్వారంటైన్ సమయంలో కూడా తాను ప్రాక్టీస్ చేశానని.. యూఏఈలో తనను మళ్లీ చూసే అవకాశం ఉందని రైనా చెప్పాడు. రైనా అర్థాంతరంగా ఇండియాకు వచ్చిన వెంటనే... అతనికి, సీఎస్కే యజమాని, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ కు మధ్య విభేదాలు తలెత్తాయనే వార్తలు ప్రచారమైన సంగతి తెలిసిందే. దానికి తోడు రైనాకు విజయగర్వం నెత్తికెక్కిందంటూ శ్రీనివాసన్ చేసిన కామెంట్ కూడా చర్చనీయాంశమైంది.
దీనిపై రైనా స్పందిస్తూ, ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు. శ్రీనివాసన్ తనకు తండ్రి సమానులని... ఆయన కూడా తనను చిన్న కొడుకు మాదిరి చూసుకున్నారని చెప్పాడు. తాను ఎందుకు ఇండియాకు వచ్చాననే కారణం శ్రీనివాసన్ కు తెలియదని అన్నాడు. తన గురించి శ్రీనివాసన్ ఆగ్రహం వ్యక్తం చేయడంపై స్పందిస్తూ... కొడుకుని తండ్రి మందలించడం సాధారణ విషయమని చెప్పాడు.