Amanchi Krishnamohan: జగన్ కాళ్లు పట్టుకుని పార్టీలో చేరి బతికిపోయారు: ఆమంచి
- చీరాల వైసీపీలో భగ్గుమన్న విభేదాలు
- ఇకపై అరాచకాలు కుదరవన్న కరణం వెంకటేశ్
- చూస్తూ ఊరుకునేది లేదంటూ పరోక్ష హెచ్చరికలు
- నా పేరు ఉచ్చరించడానికి భయపడేవాళ్లు అంటూ ఆమంచి వ్యాఖ్యలు
చీరాల వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గాల మధ్య విభేదాలు వెల్లడయ్యాయి. వైఎస్ విగ్రహం వద్ద నివాళులు అర్పించే కార్యక్రమాలు పోటాపోటీగా సాగాయి.
ఈ క్రమంలో కరణం బలరాం తనయుడు కరణం వెంకటేశ్ మాట్లాడుతూ, చీరాలకు స్వేచ్ఛను ఇస్తామని వాగ్దానం చేశామని, ఇక్కడ గతంలో మాదిరి దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడాలంటే కుదరదని, చూస్తూ ఊరుకునే వాళ్లు ఎవరూ లేరని పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
దీనిపై మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గట్టిగా స్పందించారు. నా పేరు ఉచ్చరించడానికి భయపడేవాడు కూడా నాకు వార్నింగ్ ఇస్తాడా..? అంటూ మండిపడ్డారు. జగన్ కాళ్లు పట్టుకుని పార్టీలో చేరి బతికిపోయారు... అధికారం లేకుండా ఎక్కడా బతకలేని వాళ్లు నా గురించి మాట్లాడతారా... అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు వార్నింగ్ ఇచ్చినట్టు వచ్చిన వార్తలను ఖండిస్తున్నా! అంటూ ఆమంచి స్పష్టం చేశారు.