ganapati: మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి లొంగుబాటు వార్తలపై స్పందించిన మాజీ మావోయిస్టు జంపన్న
- తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గణపతి
- లొంగిపోవడానికి సంప్రదింపులు జరపలేదు: జినుగు
- ఆరోగ్య సమస్యలుంటే పార్టీ కేంద్ర కమిటీ చూసుకుంటుంది
- మావోయిస్టు కేంద్ర కమిటీలో విభేదాలు లేవు
తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు పోలీసుల ముందు లొంగిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఆయన బాటలోనే మరికొందరు కూడా లొంగిపోతారని ప్రచారం జరుగుతోంది. అయితే, గణపతి లొంగిపోతారంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదని మావోయిస్టు పార్టీ మాజీ సభ్యుడు జినుగు నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న తేల్చిచెప్పారు.
పోలీసులకు లొంగిపోవడానికి ఆయన సంప్రదింపులు జరిపినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. ఆయనకు ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ చూసుకుంటుందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. గణపతి లొంగుబాటు విషయంలో పోలీసుల స్టేట్‌మెంట్‌లోనూ స్పష్టంగా వాళ్లు వస్తే తాము సహకరిస్తామని మాత్రమే చెప్పారని ఆయన అన్నారు.
మావోయిస్టు కేంద్ర కమిటీలో విభేదాలు ఉన్నట్లు, అందుకే గణపతి లొంగిపోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. వీటిని కూడా ఆయన కొట్టిపారేస్తూ, కమిటీలో ఎలాంటి ప్రాంతీయ విభేదాలు లేవని, అలాగే గణపతిని మావోయిస్టు పార్టీ వదులుకోబోదని స్పష్టం చేశారు. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి మావోయిస్టుల ప్రాబల్యం ఉండే ప్రాంతాల్లో జరుపుతున్న పర్యటనకు, గణపతి లొంగుబాటుకు కూడా సంబంధం లేదని ఆయన చెప్పారు.