Parakala Prabhakar: నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై భర్త పరకాల ప్రభాకర్ విమర్శలు!
- కరోనా సంక్షోభం, దేశ ఆర్థికపరిస్థితిని దైవఘటనగా పేర్కొన్న నిర్మల
- ఆర్థిక మందగమనం ఎప్పటినుంచో ఉందన్న పరకాల
- కేంద్రం వద్ద సరైన విధానాలు లేవని విమర్శలు
గతంలో ఏపీ ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన పరకాల ప్రభాకర్ బహిరంగ వ్యాఖ్యలు చేయడం చాలా అరుదు. అయితే, ఆయన సాక్షాత్తు తన అర్ధాంగి, దేశ ఆర్థికమంత్రి అయిన నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే కరోనా సంక్షోభం, ఆర్థిక పరిస్థితిపై దాని ప్రభావాలను నిర్మలా సీతారామన్ దైవఘటన(యాక్ట్ ఆఫ్ గాడ్)గా పేర్కొన్నారు.
సూక్ష్మ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనే ఆలోచనలు కేంద్రం వద్ద లేవని, దాన్నే వాళ్లు యాక్ట్ ఆఫ్ గాడ్ అంటున్నారని ప్రభాకర్ విమర్శించారు. కరోనా వచ్చింది ఈ మధ్యేనని, కానీ ఆర్థిక మందగమనం అంతకుముందు నుంచే ఉందని ఆయన స్పష్టం చేశారు. 2019 అక్టోబరులోనే ఆర్థిక పరిస్థితిపై స్పష్టం చేశానని, కానీ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. ఆ తర్వాత వృద్ధిరేటు 23.9 శాతం తగ్గిందని వివరించారు. ఇకనైనా ఏదో ఒకటి చేసి దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలని తెలిపారు. పరకాల ప్రభాకర్ ఇటీవలే మహా టీవీ న్యూస్ చానల్ లో తన వాటాలను ఉపసంహరించుకుని బోర్డు నుంచి వైదొలిగారు.